1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బాబు ట్రాప్‌లో పడొద్దంటూ పవన్ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని హితవు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి కొడాలి నాని ఓ హితవు పలికారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. అన్న మెగాస్టార్ చిరంజీవిని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలన్నారు. 
 
పవన్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఏపీలో చిత్రం విడుదలకు అనేక అడ్డంకులను ప్రభుత్వం సృష్టించింది. అయినప్పటికీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. అయితే, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టిక్కెట్ ధరలు పెంచలేదు. దీనిపై పవన్ అన్నయ్య నాగబాబు విమర్శలు గుప్పించారు. వీటికి మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. 
 
రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కాదన్నారు. వారంతా చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులని చెప్పారు చంద్రబాబు నాయుడు బాగుండటం కోసం పవన్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. పవన్, నాగబాబు అభిమానులకు మేం చెప్పేది ఇదేనని ఆయన చెప్పారు. 
 
"ఏ సినిమా అయినా ఈ రోజుల్లో నాలుగు వారాల కంటే ఎక్కువగా ఆడటం లేదు. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనం కోసమే సినిమాను వాడుకుంటున్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. సినిమా థియేటర్ల విషయంలో కమిటీ వేశాం. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా అన్ని అంశాలను పరిశీలించాలి. టిక్కెట్ల విషయం తేలేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈ విషయం 'భీమ్లా నాయక్' నిర్మాతకు, అందులో నటించిన పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుంటే ఓడిపోయే సీట్లను జనసేనకు ఇస్తారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలన్న పాలసీతో మీరు పని చేస్తే ఉపయోగం ఉండదు. పవన్ సొంత అన్న చిరంజీవిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. వంగి వంగి దండాలు పెట్టారని అంటున్నారు. చిరంజీవిని జగన్ మొదటి నుంచి గౌరవిస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ మరచిపోయారా? అంటూ కొడాలి ప్రశ్నించారు.