శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:46 IST)

రెడ్ బుక్ పేరెత్తితే వైకాపా నేతల పంచెలు తడిసిపోతున్నాయ్ : మంత్రి కొల్లు రవీంద్ర

kollu ravindra
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రూపొందించిన రెడ్ బుక్ పేరెత్తితేనే వైకాపా నేతల పంచెలు, కోకలు తడిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ఐదేళ్లలో అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా మాట్లాడిన వైకాపా నేతలంతా ఇపుడు ఏమైపోయారని ఆయన ప్రశ్నించారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై ప్రజా దర్బారులో భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. అబ్కారీ, మైనింగ్ శాఖల్లో భారీ దోపిడీ జరిగిందన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతామన్నారు. 
 
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతల పంచెలు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల నుంచి, ప్రజల్లో నుంచే పుట్టుకొచ్చిందే రెడ్ బుక్ అని వివరించారు. అధికారం ఉంది కదా అని నాడు రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఇపుడు వాళ్లంతా ఏమైపోయారని ఆయన ప్రశ్నించారు. 
 
నాడు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడికి దిగి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో ఉంటే అతడిని విమానాశ్రయం నుంచి వెనక్కి తీసుకొచ్చామని వివరించారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా తప్పించుకోలేరన్నారు.