గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (15:27 IST)

ఎన్జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ.. నిరసనలు మళ్లీ మొదలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని, ఉద్యోగుల పక్షపాతి ఈ ప్రభుత్వం అని అనేక వేదికల మీద, అనేక మంది ప్రభుత్వ పెద్దలు తమ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు కానీ, ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఆ విధంగా అనిపించడం లేదని డెమోక్రాటిక్ పి.ఆర్.టి.యూ రాష్ట్ర కార్యదర్శి కొచ్చర్ల మోహన రావు ఆరోపించారు.
 
 
నిన్న ప్రభుత్వం ఉద్యోగులకు విడుదల చేసిన పి. ఆర్. సి, పెండింగ్ డి.ఏ ల జి.ఓ లు చూస్తుంటే, ఈ జీవోల్లో ఉన్న అసంబద్ధ అంశాలు సామాన్యులకు సైతం అర్థం అవుతోందని ఆయన దుయ్యబట్టారు. పని చేసినప్పుడు కూలి పెంచడం లేదా పెంచకుండా పాత కూలి ఇవ్వడం మనకి తెలిసిన నీతి సూత్రం. కానీ ఇక్కడ కూలి తగ్గించడం మన రాష్ట్రంలోనే చెల్లిందని ఆయన తెలిపారు.
 
 
12% ఉన్న ఇంటి అద్దె అలవెన్స్ 8% కి తగ్గించడం మన ప్రభుత్వానికే చెల్లిందని  మండల ఏ. పి. టి. ఎఫ్ అధ్యక్షుడు టి. వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇలాంటి అసంబద్ధ పి. ఆర్.సి ని ఇంతవరకు ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని, ఇదే మొదటిదని డెమోక్రాటిక్ పి.ఆర్.టి. యూ జిల్లా కార్యదర్శి మిరియాల బోసుబాబు ప్రభుత్వ చర్యలను ఖండించారు. 
 
 
ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలకు గండి కొట్టే ఈ చర్యలకు నిరసనగా మూలపాడులో  ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, తమ నిరసన తెలియజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో డెమోక్రాటిక్ పి.ఆర్.టి.యూ జిల్లా కన్వీనర్ పరికెల రవికుమార్, స్కూల్ హెచ్.ఎం. కె. ఎన్. జె లక్ష్మి, మండల అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి సుబ్బలక్ష్మి, నాయకులు చింతా పుల్లయ్య, సతీష్, వెంకటేశ్వర్లు కసిరెడ్డి, ప్రభాకర్, నరేంద్ర, ఉపాధ్యాయులు శర్మ, శ్రీనివాస రావు, కుమారి, స్వరూప రాణి, పప్పు సావిత్రి, ఎం.వి. సావిత్రి, చైతన్య, గోపాల కృష్ణ, కపూర్ తదితరులు పాల్గొన్నారు.