1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (18:09 IST)

పీఆర్సీ విషయంలో జగన్ ఉద్యోగులను మోసం చేశారు...

సీఎం జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల  నేతలకు మాత్రమే నచ్చాయ‌ని, ఉద్య‌గోలంతా బాధ‌ప‌డుతున్నార‌ని ఎపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. పీఆర్సీ విషయంలో జగన్ ఉద్యోగులను మోసం చేశాడ‌న్నారు. జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే నచ్చాయ‌ని, ఫిట్ మెంట్ తగ్గించినా.. జీతాలు తగ్గుతున్నా వారు ఆనందం వ్యక్తం చేయడం విడ్డూరమ‌న్నారు.
 
 
కాంగ్రెస్ హయాంలో 12 శాతం ఫిట్ మెంట్ పెంచాం... 2015లో చంద్రబాబు నాలుగు శాతం పెంచారు...సీఎం జగన్ మాత్రం సలహాదారులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. మైనస్ 20 శాతం ఫిట్ మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. డిఎ లు కొత్తగా కలిపేదేముంద‌ని, దానిని కూడా ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంద‌న్నారు.
 
 
కొంతమంది లొంగిపోయిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రకటనలు ఇప్పించుకున్నార‌ని, 62 యేళ్ల పదవీ విరమణపెంపు పై ఉద్యోగులు కూడా ఆవేదన చెందుతున్నార‌న్నారు. ఈ విషయంపై మరోసారి పునరాలోచన చేయాలని కోరుతున్నామ‌ని శైల‌జానాధ్ అన్నారు. హెచ్.ఆర్.ఎ పై స్పష్టత ఇవ్వలేదు.. అయినా సీఎం తానా అంటే తందానా అంటున్నార‌ని ఆరోపించారు. పీఆర్సీ పై జూన్ 30 కల్లా మంచి నిర్ణయం అంటే.. ఇక ఏమీ ఉండదనే అర్దం అని, అందుకు గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంద‌న్నారు. దీనికి ఇరవై శాతం ఫిట్ మెంట్ తగ్గిస్తే చప్పట్లు కొట్టేవారు సమాధానాలు చెప్పాల‌న్నారు. 
 
జగన్ పాలనలో రాష్ట్రం కునారిల్లుతుంద‌ని, రెండు వేల కోట్ల కోసం జగన్ ఢిల్లీకి పోతున్నార‌ని ఆయ‌న అవ‌హేళ‌న చేశారు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. భయ భ్రాంతులకు గురి చేస్తూ పాలన చేయాలని జగన్ భావిస్తున్నార‌ని, స్వచ్చంద ఓటీస్ పేరుతో ప్రజలను భయపెట్టి అమలు చేస్తున్నార‌న్నారు. సంక్షేమ పధకాలను ఆపేస్తామని మీ వాలంటీర్లతో బెదిరిస్తున్నది వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు. బయటకు వచ్చి వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో మీ మంత్రులు ఉన్నార‌ని, కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా వ్యవరిస్తున్నా.. ఒక్క మాట అనలేని దుస్థితిలో జగన్ ఉన్నార‌ని చెప్పారు.
 
 
ఈనెల 22వ తేదీ నుంచి సేవ్ ఎపీ పేరుతో జనజాగరణ యాత్ర చేస్తామ‌ని, జగన్ పాలన, దిగజారుడు తనాన్ని కూడా ప్రజలకు వివరిస్తామ‌న్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా, అమరావతి, ఉత్తరాంధ్రకు నిధులు గురించి ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడైనా జగన్ పాలన తీరు మార్చుకుని.. ప్రజలకోసం పని చేయాల‌న్నారు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్దం కావడం లేద‌ని, విభజన హామీలు అమలు చేయని వారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. జిన్నా టవర్స్, కేజీహెచ్ ఆసుపత్రులు మాత్రమే బీజేపీకి కనిపిస్తాయని, దాడుల బారిన బాడుతున్న దళితుల బాధలు మాత్రం కనిపించవ‌న్నారు. ఏపీకి బీజేపీ చేసినంత మోసం  ఎవరూ చేయలేద‌న్నారు. పంజాబ్ ఉదంతాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నార‌ని, కేవలం ఆర్.యస్.యస్ భావజాలంతోనే బీజేపీ పని చేస్తుంద‌న్నారు.