ఏపీలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో పలు ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ గెజిటెడ్ కేటగిరి కిందకు వచ్చే 38 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-6, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 29, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు, ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్- 2(ఉమెన్)- 2 పోస్టులు కలిపి మొత్తంగా 38 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సూచించారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ ఏడో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ సబ్ సర్వీస్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ప్రొవిజినల్గా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. https://psc.ap.gov.in వెబ్సైట్లో, కమిషన్ కార్యాలయ నోటీస్ బోర్డులో జాబితా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.