పర్యాటకుల కోసం భారత దేశపు తొలి కాఫీ ఆకుల టీ... అరకులో ఎదురుచూస్తోంది...
అమరావతి : భారతదేశపు తొలి కాఫీ ఆకుల టీని పర్యాటకులకు పరిచయం చేసేందుకు కార్యాచరణ సిద్ధమయ్యింది. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాఫీ ఆకులతో
అమరావతి : భారతదేశపు తొలి కాఫీ ఆకుల టీని పర్యాటకులకు పరిచయం చేసేందుకు కార్యాచరణ సిద్ధమయ్యింది. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాఫీ ఆకులతో టీ తయారు చేసే వినూత్న విధానాన్ని ప్రోత్సహిస్తూ, దీనికి అంతర్జాతీయ మార్కెట్టును కలిగించే క్రమంలో ఛాయ్ గురూ పేరిట వీటిని పర్యాటకులకు అందుబాటులో ఉంచుతారు.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గ్రీన్‌టీకి ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని ఆరోగ్యకరమైన అరకు కాఫీని పరోక్షంగా అందరికీ పరిచయం చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణా సంచాలకులు హిమాన్హు శుక్లా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
నాలుగు రకాల కాఫీ ఆకుల టీని పర్యాటకులకు పరిచయం చేయనున్నామని మీనా తెలిపారు. ఆరకు ఛాయ్, కుటి, ఉదయపు టీ, రోసెల్లె టీ పేరిట నాలుగు రకాల కాఫీ అకుల టీలు తయారవుతుండగా, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి వచ్చిన పర్యాటకులకు వీటిని పరిచయం చేయాలని నిర్ణయించామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. గ్రీన్ టీకి ప్రత్యామ్నాయంగా అరకు కాఫీ ఆకుల టీని విశ్వవ్యాప్తం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, తదనుగుణంగా పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
తమ ప్రయత్నం సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తుందని, రసాయన రహిత టీని ఛాయ్ ప్రేమికులు తాగగలుగుతారన్నారు. కెఫిన్ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఈ కాఫీ ఆకుల టీ అరకు ప్రత్యేకతను అందరికీ పరిచయం చేస్తుందన్నదే పర్యాటక శాఖ ఉద్దేశ్యమని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.