మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (15:38 IST)

మద్యం దుకాణాల దగ్గర ఉపాధ్యాయులకు విధులా..? : పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన

లాక్ డౌన్ సడలింపుల తరవాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం దుకాణాల దగ్గర గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు చెప్పే గురువులకు ఇవేం విధులు? ప్రభుత్వం బాధ్యతను విస్మరించి గురువులకు ఇలాంటి పనులు అప్పగిస్తుందా అని ప్రశ్నించారు. కరోనా విధులకు వారిని ఉపయోగించుకోవాలంటే పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకో, ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకో వినియోగించుకోవాలి అని సూచించారు.

ఇంతకాలంపాటు పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి మంటగలిపేసింది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు వ్యక్తిగత దూరం పాటించాలనే ఉద్దేశంతో దేవాలయాలకీ, మసీదులకు, చర్చిలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే- ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలను తెరిచి వ్యక్తిగత దూరం అనే నియమాన్ని తుంగలో తొక్కేసింది అని చెప్పారు.

మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తిలో చిత్తూరు జిల్లా రెడ్ జోన్ లో ఉండటం, శ్రీకాళహస్తిలో వ్యాధి వ్యాప్తి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, రైతాంగం, నేత కార్మికుల సమస్యలు, నీటి ఎద్దడి సమస్యలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “హిందువులు శ్రీరామ నవమి, ఉగాది, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గడప దాటకుండా చేసుకున్నారు.

ఇప్పుడు ముస్లింలు రంజాన్ మాసం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకొంటున్నారు... ప్రజలు కరోనా నియంత్రణ కోసం ఎంతో నియమబద్ధంగా ఉంటుంటే ప్రభుత్వం మాత్రం బాధ్యతను విస్మరించింది. లాక్ డౌన్ కి సడలింపులు ఇవ్వగానే మద్యం అమ్మకాలను చేపట్టడం సరికాదు.

సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉన్న విపత్కర సమయంలో దుకాణాలు తెరవడం ఏమిటి? ఆరోగ్యపరమైన విపత్తు ఉన్న సమయంలో కూడా మద్యం అమ్మకాలు ఆపలేరా?

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి తీసుకురావడం ఎంతో కష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అయినా వీరికి అర్థం కావడం లేదు. 

అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది 
శ్రీకాళహస్తి లాంటి చోట్ల ప్రజా ప్రతినిధులు చేసిన ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు వారెంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారో వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకులతో నిన్ననే రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడాను.

మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేయడం, ఆ దుకాణాల దగ్గర జనం వేలంవెర్రిగా ఉన్నా కట్టడి చేయకుండా వదిలేయడం, ప్రజా ప్రతినిధులు ర్యాలీలు చేయడం గురించి వారు ప్రస్తావించి ‘ఆంధ్ర ప్రదేశ్ కరోనా ఫ్రెండ్లీ స్టేట్’ అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు.

తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా – మన వైపు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం గోడ కట్టేసింది... ఇక్కడ కరోనా తీవ్రత చూసి. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేంద్ర గారు తాము జాగ్రత్తలు తీసుకోకపోతే కర్నూలు, గుంటూరుల్లా అయ్యేది అన్నారు. గోడ కట్టడం, పొరుగు రాష్ట్రాల మంత్రులు మనల్ని ఉదహరించడం చూస్తే.. మన రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా కట్టడిపై చిత్తశుద్ధి లేదని వెల్లడవుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. వారికి ఉపశమనం కలిగేలా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. టీటీడీలో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించారు అని మన నాయకులు తెలపగానే స్పందించాను.

ఆధిపత్యపు పోరుకు చిన్నపాటి జీతాలతో పనిచేసేవారిని బలి చేయడం భావ్యం కాదు. ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న బాధలు నా దృష్టికి చేరాయి. మామిడి, టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రధానంగా ఉద్యాన పంటలు వేసినవారు ఎంతగా నష్టపోయారో సమగ్ర నివేదిక ద్వారా కేంద్రానికి తెలియచేస్తాను.

చేనేత కార్మికులు, చిన్నపాటి పరిశ్రమలు నిర్వహించేవారు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. వీరందరిపై ప్రభుత్వం సానుభూతి చూపాలి. చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయం నా దృష్టికి చేరింది. చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో రోజూ 2 వేల ట్యాంకర్లు సరఫరా చేయాల్సి ఉంటే కనీసం 800 కూడా సరఫరా చేయలేకపోతున్నారు.  ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణ స్పందించాలి” అన్నారు.

ప్రజా ప్రతినిధుల చర్యలు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి: నాదెండ్ల మనోహర్  
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఇది ఎవరం ఊహించని విపత్తు. తిరుమల శ్రీవారి దర్శనం ఇంతకాలం పాటు భక్తులకు దూరం అవుతుందని ఊహించం. అలాంటి ఆరోగ్య విపత్తు వచ్చింది. చిత్తూరు జిల్లాలో 70శాతం కేసులు ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి.

ఈ జిల్లాలో ప్రజా ప్రతినిధులు చేపట్టిన కార్యక్రమాలను జాతీయ మీడియా విమర్శించింది. ప్రజా ప్రతినిధుల చర్యలు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మామిడి రైతులు కరోనా మూలంగాను, అకాల వర్షాలు, గాలి దుమారంతో నష్టాల పాలయ్యారు. టమోటా రైతులకు కనీసం కూలీ ఖర్చులు కూడా దక్కే అవకాశం లేదు. రైతాంగం దుస్థితిపై అన్ని వివరాలు తీసుకుంటున్నాం. సమగ్ర నివేదికను కేంద్రానికి అందిస్తాం” అన్నారు. 

చిత్తూరు జిల్లా పరిస్థితిని నాయకులు వివరించారు. పార్టీ పి.ఏ.సి. సభ్యులు డా.పి.హరిప్రసాద్ మాట్లాడుతూ “జిల్లాలో ఎక్కువ శాతం కేసులు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఉన్నాయి. అధికార పక్ష నాయకుల వైఖరి, క్వారంటైన్ సరిగా చేయకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటింది. తిరుపతి ప్రాంతంలో తక్కువగానే ఉన్నాయి. లాక్ డౌన్ సమయం నుంచి పేద, దిగువ మధ్య తరగతి తీవ్ర బాధలుపడుతున్నాయి” అన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వినుత నగరం మాట్లాడుతూ “శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. కోవిడ్ అనుమానితులకు క్వారంటైన్ చేయించే విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. 200 వాహనాలతో ర్యాలీలు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా బారినపడ్డారు. ఇంత ఆందోళనకర సమయంలో కూడా జనసేన శ్రేణులు ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాయి” అన్నారు.

మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ స్వాతి గంగారపు మాట్లాడుతూ.. “కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ మూలంగా టమోటా రైతులు, కూలీ, చేనేతపై ఆధారపడ్డ వారు అన్ని విధాలా నష్టపోయారు. నేతన్న నేస్తం అనే ప్రభుత్వ పథకంలో నేత షెడ్స్ లో పని చేసే నేత కార్మికులను అనర్హులను చేశారు. ఫలితంగా వేలమందికి ఆర్థిక సాయం అందలేదు.

ఇప్పుడు కరోనాతో ఉపాధి దూరమైంది” అన్నారు. తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ “జిల్లాలో మద్యం దుకాణాల దగ్గర విచ్చలవిడిగా జనం గుమిగూడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మద్యం కోసం వచ్చేస్తున్నారు. ఇలాగైతే కరోనా అదుపులోకి రాదు” అన్నారు.

కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ డా.ఎం.వెంకట రమణ మాట్లాడుతూ “ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకి, ఇతర ఆరోగ్య సిబ్బందికి తగిన రక్షణ పరికరాలు సమకూర్చడం లేదు. ఓపీ చూసేవారికీ తగిన మాస్కులు లేవు. ఫలితంగా సిబ్బంది కరోనా బారినపడుతున్నారు” అని చెప్పారు. జిల్లా నాయకులు పొన్ను యుగంధర్, శ్రీ బి.దినేష్, యగవింటి మహేష్, మాసి కృష్ణమూర్తి తదితరులు జిల్లా సమస్యలను తెలిపారు.