అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో పంద్రాగస్టు ఏర్పాట్లు
భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రోటోకాల్ మొదలైంది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో పంద్రాగస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివారం ఉదయం విజయవాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏపీ సీఎం జెండా ఆవిష్కరణలో పాల్గొంటారు. దీని కోసం డి.జి.పి, ఇతర అత్యున్నత అధికారులు హాజరై, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం గ్రౌండ్స్ అంతా తనిఖీలు ముమ్మరం చేశారు.
ఉదయం 8గంటలకు అసెంబ్లీ భవనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆలాగే ఉ.8.15 గం.లకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
సచివాలయం మొదటి భవనం వద్ద ఉ.7.30 గం.లకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే, వివిధ జిల్లాలలో త్రివర్ణ పతాకం ఎగురవేయాల్సిన మంత్రుల లిస్ట్ కూడా ఇప్పటికే జిల్లా కేంద్రాలకు వెళ్ళిపోయింది.
ఆయా మంత్రులు అక్కడ ముఖ్య అతిథులుగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొంటారు.