1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (07:41 IST)

టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తికాలేదు.. ఇపుడు స్కూల్స్ ప్రారంభమా? హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయి. కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో స్కూళ్లను రీ ఓపెన్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
ఉపాధ్యాయులకు ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లను ఎలా తెరుస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది 85 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. 
 
మిగిలిన టీచర్లకు కూడా త్వరితగతిన టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఈ పిటిషన్‌కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. 
 
మరోవైపు స్కూళ్లను తెరవాలని కొందరు వాదిస్తున్నారు. రాజకీయ నాయకుల భారీ సభలు, సమావేశాలు, షాపులు, రెస్టారెంట్లు, వాహన రాకపోకలు అన్నీ జరుగుతున్నప్పుడు… స్కూళ్లకు మాత్రం అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్కూళ్లను తెరిస్తే విద్యార్థుల ఆరోగ్యాలకు రక్షణ ఎక్కడుంటుందని మరికొందరు వాదిస్తున్నారు.