శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (17:15 IST)

విశాఖకు వైసీపీ కేంద్ర కార్యాలయం: దసరా నాటికి సీఎం జగన్ పాలన

విశాఖకు వైసీపీ కేంద్ర కార్యాలయం రానుంది. ఏపీలో అధికార వైసీపీ చూపుంతా ఇప్పుడు విశాఖపైనే పడింది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే విశాఖ నుంచి పాలన కొనసాగాల్సి ఉంది. కానీ కోర్టు తీర్పులు.. రాజకీయ కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే దసరా నాటికి సీఎం జగన్ విశాఖ నుంచి పాలిస్తారని.. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
మంత్రులు సైతం పదే పదే ఇదే మాట చెబుతున్నారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన మొదలవుతుందని.. అది ఏ క్షణమైనా జరగొచ్చని అంటున్నారు. ఈ ప్రచారం ఉండగానే.. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే విశాఖకు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంది. అక్కడి నుంచి కార్యకలాపాలు అన్నీ కొనసాగుతున్నాయి. కానీ త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని జగన్ భావిస్తున్న తరుణంలో అత్యంత త్వరగా పార్టీ కార్యాలయ ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ నేతలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఉడా పార్కు సమీపంలో నిర్మాణం పూర్తికావస్తున్న ఒక భవనాన్ని పార్టీ కార్యాలయానికి అనువైనదిగా గుర్తించినట్టు వైసీపీ వర్గాల టాక్. ఆ భవన యజమానితో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు విశాఖ వైసీపీ కేడర్‌లో చర్చ జరుగుతోంది.
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు, మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని అంటున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారేందకు వడివడిగా అడుగులు పడుతూనే ఉన్నాయి. కోర్టు తీర్పు కోసం ఎదరు చూడకుండా ఇతర ప్రత్యామ్నాయలపై ప్రభుత్వ వర్గాలు ఫోకస్ చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు తరలించకుండానే.. సీఎం జగన్ విశాఖ నుంచి పాలించేందుకు ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 
 
తాజాగా మంత్రులు, ఎంపీలు అంతా అదే మాట చెబుతున్నారు. ఇటీవల ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజధానుల అంశంపై మాట్లాడారు. విశాఖపట్నానికి రాజధాని రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ దసరా నాటికి ఇక్కడ నుంచి పాలన కొనసాగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.