మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (17:19 IST)

టీడీపీ ఓడిపోలేదు.. దొంగ ఓట్లు వేయించుకున్నోళ్ళదే ఓటమి : అచ్చెన్నాయుడు

స్వరాష్ట్రం నుంచే కాదు.. పొరుగు రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేయించుకున్నవారే ఓడిపోయారని, తాము ఓడిపోలేదని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 
 
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార వైకాపా ఘన విజయం సాధించింది. టీడీపీ కంచుకోటగా ఉన్న కుప్పంలో వైకాపా జెండా ఎగురవేయడంతో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తొలిరోజు నుంచి కుప్పంలో వైసీపీ చేసిన అరాచకాలు అందరికీ తెలుసని అన్నారు. చేతకాని ఎన్నికల సంఘం టీడీపీ ఓటమికి కారణమని విమర్శించారు. పోలీసు వ్యవస్థ వైసీపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో నైతిక గెలుపు టీడీపీదేనని అన్నారు.
 
ఇదే సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పెద్దిరెడ్డి దొంగ ఓట్ల మంత్రి అని దుయ్యబట్టారు. పక్కనున్న నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజాదరణను కోల్పోయిందని ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగితే వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు.