గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:34 IST)

ఆయేషా కేసు వై.ఎస్., హ‌జీరాభీ కేసు జగన్ నీరుగార్చారు: లోకేష్

గతంలో అయేషా కేసును వైఎస్సార్, ప్రస్తుతం హజీరాభీ కేసును సీఎం జగన్ నీరుగార్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళవారం లోకేష్ కర్నూలులో హ‌జీరాబీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హజిరాభీ హత్యకు గురై ఏడాది అయిందని, వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. హజీరాభీ కుటుంబానికి పదిలక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదు వందల మంది మహిళలపై దాడులు జరిగాయన్నారు. జగన్‌కు టీడీపీ నేతలను చూస్తే, భయమేసి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు.

వైఎస్ షర్మీలతో పాదయాత్ర చేయించుకొని తెలంగాణకు పంపిం చేశాడు, ఇంకో చెల్లిని కన్నీళ్లు మిగిల్చాడని లోకేష్ దుయ్యబట్టారు. జగన్ పాలనలో తాడేపల్లి పరిధిలోని మహిళలకు రక్షణ లేదని చెప్పారు. ‘మీ కూతుళ్లకు ఇలాగే జరిగితే జగన్‌రెడ్డి ఊరుకుంటారా’ అని ప్రశ్నించారు.

రాబోయే రోజుల్లో తాడేపల్లి తలుపులు తట్టే రోజులు రానున్నాయన్నారు. నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య ఉదాంతంపై సీబీఐ విచారణ చేస్తామని హోంమంత్రి సుచరిత చెప్పారు.. ఏమైంది ఆ విచారణ అని నిలదీశారు. 21 రోజుల్లో హజీరాభీ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దిశా చట్టంతో మహిళలకు రక్షణ లేదని, కానీ సాక్షి టీవీ పత్రికకు కాసుల పంట పండుతోందన్నారు. మహిళలపై దాడులు జరిగితే గన్ కంటే ముందొస్తానన్న జగన్ ఇప్పుడు ఎందుకు రావడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు.