గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (17:24 IST)

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

balineni
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో సౌర విద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శించారు. ఎవరి మెప్పు కోసమే తాను పని చేయడం లేదని, గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు. 
 
సెకీ ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని, తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే రావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. 
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే తాను పైకి వచ్చానంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సే రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడు తానే మీడియా ముఖంగా చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. 'నేను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. వైఎస్పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లా. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నా. పవన్ వెంట ఉండి కూటమితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆయన స్పష్టం చేశారు.
 
రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డేనా అని బాలినేని ప్రశ్నించారు. 'షర్మిల, విజయమ్మ కాదా?. షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే రాజశేఖర్ రెడ్డి కుటుంబం కానట్లు ఏమీ పట్టించుకోరా?' అని అన్నారు. 'తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా?. ఒంగోలులో పోటీ చేసే నాయకుడే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా?. చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి నిలబెట్టడం నాకు నచ్చలేదు. అందుకే ఒప్పుకోలేదు' అని ఆయన అన్నారు.