జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సంక్షేమంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు ఖరారు చేయనుంది.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు ఖరారు చేయనుంది. రాష్ట్రంలో అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేసే అంశంతో పాటు జెరూసలెం, హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం పెంపు అంశంపై చర్చించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల రిజిస్ట్రేషన్, రెండేళ్ల తర్వాత విక్రయించేందుకు వీలుగా జీవో సవరణ, దేవాలయాల్లో ట్రస్టీల నియామకం తదితర అంశాలపై ప్రతిపాదనలు కేబినెట్ ముందున్నాయి. వీటితోపాటు జిల్లా సచివాలయ నిర్మాణం కోసం బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్‌కు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.
మంత్రులపై ఆగ్రహం
నేడు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రతి మంగళవారం, బుధవారాల్లో మంత్రులు కచ్చితంగా సచివాలయంలో ఉండాలని సీఎం ఆదేశించారట. కాగా, నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో గీతం వర్సిటీకి భూముల కేటాయింపును రద్దు చేశారు.
టీటీడీ మినహా దేవాలయాల్లో బోర్డు సభ్యుల నియామకం కోసం చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుపై ఈ భేటీలో చర్చించారు. అమ్మఒడి, కొత్తగా 77 మండలాల్లో పోషకాహార పథకం అమలుపై చర్చించారు. కృష్ణా, గోదావరి కెనాల్స్ క్లీనింగ్ మిషన్ ఏర్పాటుపై చర్చించారు.