శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (13:41 IST)

దేశంలో తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడిలా, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మగా స్త్రీలను తలచి అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. 
 
రాష్ట్రంలో హోం గార్డులు మొదలు, డీజీపీ వరకు పోలీసుల కష్టాలు స్వయంగా చూశానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. అందుకే శాఖలో పలు మార్పులు తీసుకువచ్చామని, హోం గార్డుల వేతనాలు పెంచడంతో పాటు, దేశంలోనే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేశామని చెప్పారు.
 
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులపై రచించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వారికి సెల్యూట్‌ పోలీసు త్యాగాలకు ప్రతిరూపంగా అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, అది ఎప్పుడు మొదలైందన్న విషయం ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలోనూ ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని, వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు.
సార్వభౌమాధికారానికి నిదర్శనాలు. ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మకు ఒకటి గుర్తు చేస్తున్నానని, పోలీసు టోపీ మీద సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనాలు అని సీఎం పేర్కొన్నారు. వాటిని అందరి రక్షణకు వినియోగించే వారే పోలీసులు అని, అందుకే పోలీస్‌ స్టేషన్‌ను రక్షకభట నిలయం అని పిలుస్తామని అన్నారు. ఎవరికీ మినహాయింపు లేదు
 
‘నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సదస్సులో నా మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆరోజు నేను చెప్పాను. శాంతి భద్రతల విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని చెప్పాను. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, పిల్లల విషయంలోనూ.. మొత్తంగా పౌరుల రక్షణ విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడవద్దని చెప్పాను. అలాగే బడుగు బలహీన వర్గాలు, పేదల మీద హింస జరిగితే కారకులను ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టమని చెప్పాను’.
 
పోలీసు వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే పేదలు వివక్షకు గురి కాకుండా అందరికీ ఒకే నియమంతో, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగితేనే పోలీసు వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. న్యాయం, ధర్మం.. ఇవన్నీ కూడా అందరికీ ఒకటే. ఒక్కొక్కరికి ఒక రూల్‌ ఉండకూడదు. ఎవరికైనా ఒకే చట్టం అయినప్పుడే వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి. 
 
చట్టం అన్నది అందరికి ఒకటే కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి. ఆ బాధ్యత మనందరి మీద ఉందన్న విషయం మర్చిపోవద్దని ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మకు చెబుతున్నాను’ అని సీఎం స్పష్టం చేశారు.
 
పోలీసులు ప్రజల మన్నన పొందినప్పుడే మనం ఏదైనా చేశామని చెప్పుకోవచ్చని, ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వారి కష్టాలు స్వయంగా చూశాను. పోలీసుల కష్టం నా కళ్లతో స్వయంగా చూశాను. హోం గార్డులు మొదలు డీజీపీ వరకు అందరి కష్టాలు నాకు బాగా తెలుసు. కనీసం వారానికి ఒకరోజు సెలవు కూడా లేకుండా పని చేస్తున్నారు. 
 
అందుకే దేశంలో తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించామని సగర్వంగా తెలియజేస్తున్నాను. దీని వల్ల మెరుగైన పోలీసు వ్యవస్థ వస్తుందని విశ్వసిస్తున్నాను. అందుకే ఈ మార్పుకు నాంది పలికాము’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
 
రాష్ట్రంలో లంచగొండితనం, అవినీతి, రౌడీయిజాన్ని, నేర ప్రవర్తన వంటి వాటిపైనా నిజాయితీగా యుద్ధం చేయాల్సిన బాధ్యతను ప్రతి పోలీసు సోదరుడు, పోలీసు అక్కా చెల్లెమ్మకు గుర్తు చేస్తున్నానని, అలా వారు పని చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుదని సీఎం చెప్పారు.
 
 
పోలీసుల సంక్షేమం - ప్రభుత్వం 
‘ఆ దిశలో కాస్త ఒక అడుగు ముందుకు వేస్తూ పలు చర్యలు తీసుకున్నాము. హోంగార్డుల జీతాలు మెరుగుపర్చాము. గతంలో వారికి రూ.18 వేలు ఇవ్వగా, మేము అధికారంలోకి రాగానే జీతం రూ.21 వేలు చేశాము. 
 
విధి నిర్వహణలో వారు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం కూడా ఇస్తామని ప్రకటించాము. అంతే కాకుండా వారికి రూ.30 లక్షల రూపాయల బీమా.. ఇంకా పోలీసు సిబ్బంది మరణిస్తే వారికి రూ.40 లక్షల బీమా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నాము. 
 
దేశంలో తొలిసారిగా పోలీసు సిబ్బంది పదవీ విరమణ తర్వాత కూడా ఈ బీమా సదుపాయం కల్పిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
 
చివరగా, ప్రతి పోలీసుకు ఒకటే చెబుతున్నానని, విధి నిర్వహణలో వారు మంచి పేరు తెచ్చుకునేలా అడుగులు వేయాలని, అందుకు ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని సీఎం చెప్పారు.

హోం మంత్రి ఎం.సుచరిత, డీజీపీ గౌతమ్‌ సావంగ్‌తో పాటు, పలువురు పోలీసు ఉన్నతాధికారుల, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.