బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (08:23 IST)

71వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

రాజధాని కోసం రైతులు రోజు రోజుకూ తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నా...వెలగపూడిలో 71వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.

అలాగే అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేస్తున్నారు. 
 
ప్లీజ్‌ ట్రంప్‌, సేవ్‌ అమరావతి!
ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో రైతులు, మహిళలు ట్రంప్‌ ఫొటోతో కూడిన ప్లకార్డులను పెట్టుకొని అమరావతికి మద్దతు ఇవ్వాలని నినాదాలు చేశారు. మంగళవారం తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా.. ‘ప్లీజ్‌ ట్రంప్‌ సేవ్‌ అమరావతి’ అని నినదించారు.

సీఎం జగన్‌ ఆర్థిక ఉన్మాదిలా వ్యవహిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. మందడంలో మహిళలు, రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మహిళలు రూ.15,000, తెనాలి మండలం కూచిపూడి గ్రామ రైతులు రూ.10,000 విరాళం అందజేశారు.

నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు గ్రామం తాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీహరి నాయుడు, గ్రామస్తులు సంఘీభావం తెలిపారు.  మందడం, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాల్లో రైతు రిలేనిరాహార దీక్షలను ఒంగోలుకు చెందిన ఆచార్య రంగా కిసాన్‌ సంస్థ రైతు ప్రతినిధుల బృందం సందర్శించి సంఘీభావం తెలిపింది.

సంస్థ తరపున రూ.20 వేలను విరాళంగా ఇచ్చారు. రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు వృధా కావని ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి బైరాన్‌పట్నం రామకృష్ణ పేర్కొన్నారు.