గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:52 IST)

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు ఆందోళనలు

నల్లచట్టాలకు నిరసనగా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వదరకు ఆందోళనలు జరగుతున్నాయని సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ విమర్శించారు.

ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఎలకు నిరసనగా స్థానిక సుద్దపల్లి డొంక, మసిద్‌-ఎ.ఫరూక్‌ వద్ద షేక్‌ జాహిద్‌ అధ్యక్షతన సభ నిర్వహించారు. కె.నళినీకాంత్‌ మాట్లాడుతూ ప్రజల మద్య విభజన సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, దీన్ని ఎదుర్కొంటున్న ఎంతో మందిని ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు.

మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తామని ప్రకటించిన నాటి నుంచి ముస్లిములతోపాటు ఇతర వర్గాల్లోనూ అభద్రతా భావం, ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. ఎన్‌ఆర్‌సి వల్ల దేశ ప్రజలందరికీ నష్టమేనని వివరించారు.

బిజెపి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని నియంత్రృత్వ ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌, సిఎఎలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జమాతే ఇస్లామియా హింద్‌ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలంతా శాంతి సామారస్యంతో అన్నదమ్ముల్లా జీవిస్తుంటే బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో విభజిస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వాదులంతా ఐక్యమై నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఐద్వా గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన 13 రకాల ప్రశ్నలకూ ప్రజలు సరైన సమాధానం, డాక్యుమెంట్లు చూపించలేకపోతే పౌరసత్వం నిరూపించుకోలేక నిర్బంధ శిబిరాల్లో మగ్గాల్సి వస్తుందని, ప్రజలు ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు సహకరించొద్దని సూచించారు.

కార్యక్రమం లో బషీర్‌, కలామ్‌, బాజీ, రియాజ్‌ జాఫర్‌ , ప్రజాసంఘాల నాయకులు చింతల శ్రీనివాస్‌, టి.శ్రీనివాసరావు, ఖలీమ్‌, కృష్ణకుమారి, జానీబేగం పాల్గొన్నారు.