మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (13:29 IST)

మాకు జ్వరంగా ఉంది.. కోర్టుకు రాలేం... బెయిల్ పిటిషన్‌ను వాయిదావేయండి...

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్ప‌టికే జ‌గ‌న్ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌గా లిఖితపూర్వక వాదనలను సీబీఐ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీబీఐకి ఇప్ప‌టికే కోర్టు ఈ కౌంట‌ర్ వేసేందుకు చివ‌రి అవ‌కాశం ఇచ్చింది. 
 
అయినా సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. త‌మ‌కు జ్వ‌రంగా ఉన్నందున విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని, కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీబీఐ లాయ‌ర్లు కోర్టును కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
 
కాగా, అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన విషయం తెల్సిందే. రఘురామ కృష్ణరాజు, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. 
 
సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వాదన. తాను ఒక్క షరతు కూడా ఉల్లంఘించలేదని.. రఘురామ రాజకీయ ప్రయోజనాల కోసం కేసుకు సంబంధం లేని ఊహా జనిత అంశాలతో పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. 
 
అయితే, తాము వాదించేదేమీ లేదని.. విచక్షణ మేరకు చట్టప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ.. ముందుగా పేర్కొంది. అయితే ఆ తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్న సీబీఐ తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది. కానీ, కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వస్తోంది.