బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:25 IST)

ఏపీ సీఎం జగన్‍కు షాక్... బెయిల్ రద్దవుతుందా?

పలు అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో చిక్కుకునివున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై బయటవున్నారు. అయితే, ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ జగన్ పార్టీ వైసీపీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు. ఇటీవల తాను నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పిటిషన్‌ను తొలుత విచారణకు స్వీకరించలేదని, అయితే తాను కొన్ని సవరణలు చేసిన పిదప ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం జరిగిందని రఘురామ వివరించారు.
 
ఉన్నత పదవుల్లో  ఉన్నప్పటికీ న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలన్న పాయింట్ ఆధారంగా న్యాయపోరాటం సాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన క్రమంలో, సీఎం జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. 
 
జగన్ బెయిల్ రద్దు చేసి, విచారణను వేగవంతం చేయాలన్నది తన అభిమతం అని వెల్లడించారు. బెయిల్‌‌పై బయటున్న జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇకనైనా తన జోలికి రావడం మానుకోవాలని, వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని రఘురామ హెచ్చరించారు.