శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:05 IST)

వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం.. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. కోటి మందికి..?

ఏపీలోని డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. శుక్రవారం వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రుణాల వడ్డీని జమచేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 1,109 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. 9.35 లక్షల డ్వాక్రా మహిళల సంఘాల్లోని 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ కాబోతున్నది.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ రుణాల వడ్డీని రిలీజ్ చేయబోతున్నారు. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.246.15 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. 
 
బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని 'వైఎస్సార్‌ సున్నా వడ్డీ' ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్‌ 24న చెల్లించారు. 
 
ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను జమ చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తసుకోని సకాలంలో చెల్లిస్తున్నారు.