సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:07 IST)

నాడు మోడీ మెడలు వంచుతామన్న అన్న.. నేడు కేసీఆర్ మెడలు వంచుతామంటున్న చెల్లి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కుమార్తె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బాగానే మోసం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నాడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఆ మాటలు నమ్మి ఏపీ ప్రజలు వైకాపాకు ఏకంగా 22 ఎంపీ సీట్ల, 155 అసెంబ్లీ సీట్లను కట్టబెట్టారు. అంతే.. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. 
 
ఇపుడు జగన్ చెల్లి, వైఎస్ పుత్రిక వైఎస్. షర్మిల తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రటకించారు. అయితే, ఆమె పార్టీ పెట్టకముందే కార్యరంగంలోకి దూకారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుపై పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ 72 గంటల నిరాహారదీక్షకు శ్రీకారంచుట్టారు. అయితే, పోలీసులు మాత్రం ఒక్క రోజుకే అనుమతించి, ఆ తర్వాత ఆమె దీక్షను భగ్నంచేశారు. 
 
కానీ, ఆమె తన ఇంటినే వేదికగా చేసుకుని దీక్ష కొనసాగించారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం ముగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తామని ప్రగల్భాలు పలికారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేని విమర్శించారు. 
 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో షర్మిల గురువారం 72 గంటల ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం లోట్‌సపాండ్‌లో ఆమె నిమ్మ రసం తీసుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. 
 
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. లక్షల్లో ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు. గడీల నుంచి దొరలు పాలిస్తుంటే ప్రతిపక్షాలు గాజులేసుకుని వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఒక మహిళ నిలబడిందని, పోలీసుల భుజాల మీద గన్నుపెట్టి తమను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. 
 
పాలకులకు ఎందుకంత భయమని షర్మిల ప్రశ్నించారు. ‘‘మా ఫిర్యాదు సైతం తీసుకోలేని స్థితిలో పోలీసులున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడేందుకు ఉన్నారా..? కేసీఆర్‌ ఆజ్ఞలను అమలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా..? ఆడోళ్ల మీదా మీ ప్రతాపం..? పాలకులు, పోలీసులకు సిగ్గుండాలి. పాలకుల అహంకారంపై మహిళా లోకం ఉమ్మేస్తుంది.
 
తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై పోలీసులు మా బట్టలు లాగారు. నా చేయి విరిచారు. ఒక తమ్ముడి కాలు విరగ్గొటారు. యూనివర్సిటీల్లో వీసీలు సైతం లేరు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఉండవని చెబితే, అందరినీ పర్మినెంట్‌ చేస్తారని అనుకున్నాం. కానీ కేసీఆర్‌ మాత్రం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. 
 
3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు ఈ సర్కార్‌ పైసా సాయం చేయలేదు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్రనాయక్‌ పిల్లలను చూస్తే ఏ ఒక్కరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా..? పాలకులది గుండెనా..? బండరాయా..? ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. 
 
రాజన్న బిడ్డగా చెప్తున్నా.. నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాడుతా.. కేసీఆర్‌ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా.. నేను దీక్ష విరమించినప్పటికీ ప్రతి జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ఉద్యోగాల భర్తీకి ఏడేళ్ల వరకు వయో పరిమితి పెంచాలి. నోటిఫికేషన్‌ కేలండర్‌ను విడుదల చేయాలి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దు. లక్షల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలను సృష్టిస్తాం. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం. మూడు రోజుల దీక్షకు మద్దతు తెలిపిన నిరుద్యోగ అమరుల కుటుంబాలకు ధన్యవాదాలు’’ అని షర్మిల అన్నారు.
 
అయితే, షర్మిల ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ నాడు జనగ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటా నవ్వుకుంటున్నారు. అటు అన్న ఆంధ్రా ప్రజలను మోసం చేస్తుంటే.. ఇపుడు తెలంగాణ ప్రజలను దగా జేసేందుకు చెల్లి షర్మిల రంగంలోకి దిగారంటూ విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. వీరిద్దరి తీరుతో మహానేతగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వైఎస్ఆర్ పరువుపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.