మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (13:46 IST)

దీక్షను విరమించిన వైఎస్ షర్మిల.. కేసీఆర్ ఒక మర్డరర్ అంటూ ఫైర్

YS Sharmila
ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజు తల్లికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. 
 
ఈ  సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. 
 
ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్డరర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారని.. రాష్ట్రంలో నియంత పాలన ఉందన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.