ఏపీలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకం తొలి విడతను సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్ ఆన్‌లైన్ ద్వారా రూ.671.45 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందుతారు. విద్యాదీవెనలో భాగంగా విద్యార్థులకు తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జగనన్న విద్యాదీవెన గొప్ప కార్యక్రమం. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయి.. పేదరికం నుంచి బయటపడతాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నాం. 2018-19 సంబంధించి రూ.1880 కోట్లు బకాయిలు చెల్లించాం.
2019-20కి సంబంధించి రూ.4208 కోట్లు గతేడాది చెల్లించాం. పిల్లల చదువులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే నిధులు విడుదల చేస్తాం. 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కళాశాల యాజమాన్యాలలోనూ జవాబుదారీ పెరగాలి. ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం అని జగన్ అన్నారు.
రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా బోధనా రుసుముల్ని కళాశాలల యాజమాన్యాలకు బదులుగా విద్యార్థుల తల్లులు/సంరక్షకుల ఖాతాలో జమచేయనుంది. జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో బోధనా రుసుముల్ని విడుదల చేయనుంది. సోమవారం తొలివిడత, జులైలో రెండు, డిసెంబరులో మూడు, ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులు జమచేస్తుంది.