శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:19 IST)

ఏపీలో కరోనా విలయతాండవం... 24 నుంచి నైట్ కర్ఫ్యూ... ఉచిత వ్యాక్సిన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ భూతం అన్ని వైపులా కోరలు చాచి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 45,581 కరోనా పరీక్షలు చేయగా 11,766 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,885 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,593... అనంతపురం జిల్లాలో 1,201... కర్నూలు జిల్లాలో 1,180... శ్రీకాకుళం జిల్లాలో 1,052 కేసులు గుర్తించారు. 
 
అదేసమయంలో 4,441 మంది కరోనా నుంచి కోలుకోగా 38 మంది కరోనాకు మృత్యువాతపడ్డారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,579కి పెరిగింది.
 
ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 10,09,228 కేసులు నమోదయ్యాయి. 9,27,418 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 74,231 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలావుంటే, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా పంజా ధాటికి అతలాకుతలం అవుతున్న ఏపీ వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకునేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 
 
ఈ కర్ప్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
మరోవైపు, మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని వెల్లడించారు.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా... 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 2 కోట్ల 4 లక్షల మందికి ఉచితంగా టీకా డోసులు అందిస్తామని వివరించారు. ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని మే 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.
 
కరోనా వ్యాక్సిన్ డోసులు మరిన్ని అందించాలని ఏపీ సీఎం జగన్ కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లాతో మాట్లాడడం తెలిసిందే. సీఎం విజ్ఞప్తికి భారత్ బయోటెక్ అధినేత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.