శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:08 IST)

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలను ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. 
 
తాజగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతవరణ కేంద్రాలు శుక్రవారం ప్రకటనలు విడుదల చేశాయి.
 
మ‌ర‌ఠ్వాడా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది. క‌ర్ణాట‌క మీదుగా ద‌క్షిణ కోస్తా త‌మిళ‌నాడు వ‌ర‌కు ఆవ‌ర్త‌నం ఏర్ప‌డి ఉంది. స‌ముద్ర మ‌ట్టానికి 1.5 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. 
 
ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లో రాగ‌ల మూడు రోజుల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. రేపు, ఎల్లుండి ద‌క్షిణ తెలంగాణ‌, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుముల‌ు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని తెలిపాయి.
 
కాగా.. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో పలు చోట్ల పంటలు నాశనమయ్యాయి. పిడుగుపాటు ఘటనల కారణంగా ఎడెనిమిది మంది వరకు మరణించారు. ఒక వైపు వర్షాలు కురవడంతోపాటు.. ఎండలు విపరీతంగా వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

మరోవైపు, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా, తిరుమలలో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 
 
దాదాపు గంటన్నర పాటు వర్షం పడడంతో తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ నీరు భారీగా నిలిచింది. అటు, విశాఖపట్నంలోనూ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి.