ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (07:42 IST)

విశాఖ శ్మశానంలో ఎటుచూసినా శవాల దహనాలే ... కానీ చనిపోయింది ఒక్కరేనట...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకున్నాయి. అలాగే, మృతులు కూడా పెరిగిపోతున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఎటు చూసినా శవాల దహనాలే జరుగుతున్నాయి. 
 
నిజానికి విశాఖలోని పలు శ్మశానాల్లో రోజుకు నాలుగైదు మృతదేహాలకు మాత్రమే దహనక్రియలు జరుగుతుంటాయి. అలాంటి వాటికల్లో తక్కువలో తక్కువ 15 నుంచి 20 మృతదేహాలు ప్రతిరోజూ తగలబడుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో చితులు ఆరకుండా మండుతున్నాయి. 
 
విశాఖ నగరంలో ఎక్కడ కరోనా రోగి మరణించినా జ్ఞానాపురం శ్మశాన వాటికలోనే దహనం చేస్తారు. ఇక్కడికి రోజూ 16 నుంచి 22 వరకు ఇలాంటి మృతదేహాలు వస్తున్నాయి. ఒక దగ్గర వేసిన చితిమంట ఆరక ముందే మరో మృతదేహం అంబులెన్స్‌లో వస్తోంది. కాటికాపరులు కరోనా మృతదేహాలను పక్కపక్కనే వరుసగా పెట్టి దహనం చేస్తున్నారు.
 
గురువారం ఒక్కరోజే సుమారు 18 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఒక్కరే చనిపోయారని ప్రకటించడం గమనార్హం. గుంటూరు సిటీలోని బొంగరాలబీడు శ్మశానవాటిక గురువారం కూడా ఆరకుండా మండుతూనే ఉంది. రోజంతా కరోనా మృతదేహాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఆరని చితులతో నిండిన శ్మశానవాటికలోని దృశ్యాలను వాటిక గోడలపైకి ఎక్కి యువకులు చూడటం కనిపించింది.