శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (15:36 IST)

కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? హైకోర్టు ప్రశ్న

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు, చికిత్సలు, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ విజయ్‌ సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
ఈ నెల 1 నుంచి 21 వరకు 19.64 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 16.17 లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు, 3.47 లక్షల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసినట్లు తెలిపింది. అయితే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య ఎప్పుడు పెంచుతారని విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
పగటివేళ బహిరంగ ప్రదేశాల్లోనూ, థియేటర్లు, బార్లు వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కుంభమేళా నుంచి వచ్చినవారిని పలు రాష్ట్రాలు క్వారంటైన్‌లో ఉంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ప్రశ్నించింది. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల వద్ద తీసుకుంటున్న చర్యలపై వివరించాలని పేర్కొంది.
 
'రెండో దశ పొంచి ఉందన్న విషయం తెలిసినా ఎందుకు సిద్ధం కాలేదు. కరోనా రెండో దశ వ్యాప్తి చెందాక మేల్కొంటారా? రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారని చెబుతున్నారు.. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా? సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్‌లపై ఆంక్షలేవి? ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలున్నప్పుడు.. మరి ఎన్నికలు అతీతమా? రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వానివి కాకిలెక్కలని ఆరోపణలున్నాయి' అని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.