గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:39 IST)

ఏపీలో కరోనా కల్లోలం... పీడిస్తున్న మందుల కొరత... సీఎం జగన్ ఫోన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో పాటు, మరణాల సంఖ్య కూడా అంతకంతకు అధికమవుతోంది. దాంతో కరోనా వ్యాక్సిన్‌కు, చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
 
ఈ నేపథ్యంలో, సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఫార్మా అధినేత పార్థసారథి రెడ్డిలతో ఫోనులో మాట్లాడారు. 
 
ఏపీకి కొవాగ్జిన్ టీకా డోసులను పెద్ద సంఖ్యలో అందించాలని కృష్ణ ఎల్లాను కోరారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ వయల్స్ ను భారీ సంఖ్యలో రాష్ట్రానికి పంపాలని పార్థసారథి రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
 
ఇదిలావుంటే, ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. వీఆర్ డీఎల్ ల్యాబ్‌ల ద్వారా కరోనా పరీక్షలకు అనుమతించినట్టు వివరించారు. 
 
కరోనా పరీక్షల కోసం వైద్య కళాశాలల్లో 533 మందిని నియమించినట్టు తెలిపారు. మరో 110 మంది టెక్నికల్ సిబ్బంది సాయం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
 
ఇకపై రోజుకు 60 వేల కరోనా పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆళ్ల నాని వెల్లడించారు. ట్రూనాట్ యంత్రాల ద్వారా గతంలో రోజుకు 10 వేల పరీక్షలు చేశామన్నారు. 
 
మూడ్రోజుల్లో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు కూడా చర్చలు తీసుకుంటున్నట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
 
ఇంకోవైపు ఏపీలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కోవిడ్ సెంటర్లను మూసేశామని... ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
 
అన్ని ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. 21 వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 320 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని... బళ్లారి, చెన్నై నుంచి మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని తెలిపారు.
 
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 36 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 వేల రెమ్ డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని సింఘాల్ చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్ డిసివిర్ అవసరం అంతగా లేదని అన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో 19 వేల పడకలను సిద్ధం చేశామని... ఇప్పటి వరకు 11 వేల పడకలు నిండిపోయాయని తెలిపారు. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తున్నామని చెప్పారు.