శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (09:45 IST)

వివేకా గుండెపోటుతో చనిపోయారా? మీకెలా తెలుసు?: సాక్షి టీవీ విలేఖరికి సీబీఐ ప్రశ్నలు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి, వైకాపా నేత నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసింది. అలాగే, మరికొందరు అనుమానితుల వద్ద ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు మంగళవారం సాక్షి పత్రిక విలేకరిని ప్రశ్నించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా బ్యూరో ఇన్‌‌చార్జ్‌ బాలకృష్ణా రెడ్డిని సీబీఐ విచారించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
 
వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు సాక్షి టీవీ చానల్‌లో ప్రసారమైందని, ఈ విషయాన్ని మీకెవరు చెప్పారని బాలకృష్ణారెడ్డిని సీబీఐ ఆరా తీసినట్టు సమాచారం. దీనికి ఆయన బదులిస్తూ తనకు, టీవీకి సంబంధం లేదని, తాను పత్రికకు మాత్రమే పనిచేస్తానని చెప్పినట్టు సమాచారం. 
 
కాగా, సీబీఐ అధికారులు మంగళవారం 12 మంది అనుమానితులను విచారించారు. వీరిలో వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డి, సాక్షి పత్రిక బ్యూరో ఇన్‌చార్జ్ బాలకృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మల్లి, చెన్నకేశవ, రహమ్తుల్లా ఖాన్, ఉమాశంకర్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.