మహిళల మెడలోని బంగారుపు గొలుసును నోటితోనే తెంచేస్తాడు...
మహిళల మెడలోని బంగారపు గొలుసును నోటితోనే తెంచేసే మాయగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికులతో బాగా రద్దీగా ఉండే బస్సులను ఎంచుకుని, ప్రయాణికుల దృష్టి మరల్చి మెడలోని బంగారు ఆభరణాలను క్షణాల్లో తెంచేస్తారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నాంపల్లి మాన్‌గార్ బస్తీకి చెందిన శ్యాంసుందర్, దశరథ్, లక్కీ, సాయికుమార్, అరుణ్‌రాజ్ అనే నలుగురు శ్యాంసుందర్ నేతృత్వంలో ముఠాగా అవతరించారు. ఈ గ్యాంగ్ మాసబ్‌ట్యాంక్ అడ్డాగా చేసుకొని చోరీలకు పాల్పడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఎంపిక చేసుకున్న వ్యక్తికి ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు, ఫుట్‌బోర్డుపై మరో ముగ్గురు నిలుచుంటారు.
టార్గెట్ చేసిన వ్యక్తి ముందు ఉన్న వ్యక్తి తన మోచేతులతో వ్యక్తి మెడముందు భాగం నుంచి పైకి లేపుతాడు. అదేసమయంలో వెనుక ఉండే మరొకరు బాధితుడి మెడలోని బంగారు ఆభరణాలను నోటితో కట్ చేస్తాడు. అనంతరం చోరీ చేసిన సొత్తును మరొకరికి అందజేస్తాడు. పని ముగిసిన తర్వాత ఒకొక్కరు ఒక్కో స్టాప్‌లో బస్సు దిగిపోతారు. చివరగా మాసబ్‌ట్యాంక్‌లో కలుసుకొని అక్కడినుంచి మాన్‌గార్ బస్తీకి చేరుకుంటారు.
అలా గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. దీంతో అనేక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించిన నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో ఈ ముఠా సభ్యులు లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. బస్సును ఆపి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల్లో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి 7తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.