ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:33 IST)

పంచాయతీల్లో చంద్రబాబు క్లీన్ బౌల్డ్: మంత్రి పెద్దిరెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మరో ఘోర పరాభవంను కట్టబెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 
 
తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పకూలిందని అన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనకు పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. మొత్తం 89 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 31,149 ఓట్ల మెజార్టీతో 75 సర్పంచ్ స్థానాల్లో వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు.

కేవలం 14 స్థానాలకే తెలుగుదేశం పరిమితమైందని, అక్కడ కూడా టిడిపికి వచ్చిన మెజార్టీ కేవలం 1872 ఓట్లు మాత్రమేనని అన్నారు.  రాష్ట్రంలోనే అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 84.26 శాతం వైయస్‌ఆర్‌సిపి విజయం సాధించి రికార్డు సృష్టించిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతారా? లేక తన పదవికి రాజీనామా చేస్తారా? అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. 
 
ఇంకా ఆయన ఎమన్నారంటే....
1)     రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్ధులకు అండగా ప్రజలు తీర్పు ఇచ్చారు. మొదటి విడతగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి 82.27 శాతం సర్పంచ్ స్తానాలను గెలుచుకోగా, టిడిపి కేవలం 14.72 శాతానికే పరిమితం అయ్యింది. 

- రెండో విడతలో 3127 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2676 స్థానాల్లో... అంటే 80.43 శాతం వైయస్‌ఆర్‌సిపి విజయం సాధించింది. టిడిపి 562 స్థానాలతో 16.89 శాతంకు దిగజారిపోయింది. 
- ఈ మూడో విడతలో 3221 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసిపి 2574 స్థానాలతో... 79.9 శాతం సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది. టిడిపి 509 స్థానాలతో...15.80 శాతంకే పరిమితం అయ్యింది. 
- రాష్ట్రం మొత్తం మీద 80 శాతంకు పైగా వైయస్‌ఆర్‌సిపి గెలిస్తే... తెలుగుదేశం కేవలం 14 శాతం లోపు దక్కించుకుంది. 
 
2)    వాస్తవాలు ఇలా వుంటే... చంద్రబాబు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో 36 శాతం సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నామంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడుదశల్లో వైయస్‌ఆర్‌సిపి 2196 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. దాదాపు 80.81 శాతం వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు సర్పంచ్ స్థానాలను సాధించగా, టిడిపి కేవలం 15.88 శాతంకు మాత్రమే పరిమితం అయ్యిది. 
 
3)    కుప్పం నియోజకవర్గం పరిధిలో 89 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 75 సర్పంచ్ స్థానాలను వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు గెలుచుకున్నారు. కేవలం 14 పంచాయతీలకే టిడిపి పరిమితం అయ్యింది. రాష్ట్రంలోనే వైయస్‌ఆర్‌సిపికి దక్కిన స్థానాల శాతం కంటే అత్యధిక శాతం అంటే... 84.26 శాతం సర్పంచ్ స్థానాలను కుప్పంలో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు గెలుచుకుని రికార్డు సృష్టించారు.

ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి చూస్తే... మొత్తం 1,68,058 ఓట్లు పోలైతే... వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థులకు 31,149 ఓట్ల మెజారిటీ లభించింది. తెలుగుదేశం గెలుచుకున్న 14 పంచాయతీల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మెజారిటీ కేవలం 1872 మాత్రమే. 
 
4)      నిత్యం జగన్ పైన చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తూనే వున్నాడు. ఈ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి నెట్టారంటూ, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బురదచల్లుతూనే వున్నాడు. దానికి సమాధానం ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ప్రజలు ఎలా వైయస్ జగన్  పాలనకు పట్టం కట్టారో చంద్రబాబు గమనించాలి. తన నలబై ఏళ్ళ ఇండస్ట్రీ సొంత నియోజకవర్గంలోనే ఎలా కుప్పకూలిందో అర్థం చేసుకోవాలి. కుప్పంలో టిడిపి ఏరకంగా క్లీన్ బౌల్డ్ అయ్యిందో రాష్ట్రప్రజలు గమనిస్తున్నారు. 
 
5)    సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఈ ప్రభుత్వంపైనా, వైయస్‌ఆర్‌సిపి పైనా అచెంచలమైన విశ్వాసాన్ని పెంచాయి. కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్, చిత్తూరు ఎంపి రెడ్డప్ప లతో పాటు జిల్లా, నియోజకవర్గ నేతలు సమర్థవంతంగా ఈ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.

గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు కూడా ప్రజల్లో మా పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఇప్పటి వరకు చంద్రబాబు చేస్తున్న మోసంను కుప్పం ప్రజలు గుర్తించారు. కేవలం తన పాలనతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు కుప్పం ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాలన్న జగన్ ఆశయం నెరవేరింది. ఈ విజయం  వైయస్ జగన్ కే చెందుతుంది. ఆయన పనితీరుకు ప్రజలు పట్టం కట్టి ఇచ్చిన తీర్పు ఇది. 
 
6)  సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబు అసమర్థ నాయకుడిగా నిలిచిపోయారు. కుప్పంలో తన పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఓటమికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? తన ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజీనామా చేస్తారా? లేక అసమర్థుడిగా ఇంకా కుర్చీని పట్టుకుని వేళ్ళాడతాడా? చంద్రబాబు జవాబు చెప్పాలి. ఎన్నికల సందర్భంగా కుట్రపూరితంగా మాట్లాడాడు.

మంత్రిగా వున్న నన్ను, మా డిప్యూటీ సీఎం నారాయణస్వామిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనేక ఆరోపణలు చేశాడు. ఇంకా కుప్పంలో నాలుగు పంచాయతీలు, మున్సిపాలిటీ మిగిలి వుంది. వీటిల్లో కూడా మేం విజయం సాధిస్తాం. ఇక్కడ కూడా మాకు దాదాపు ఇరవై వేలకు పైగా మెజారిటీ లభిస్తుందని అంచనా. అంటే ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే వైయస్‌ఆర్‌సిపి మొత్తంగా యాబై వేలకు పైగా మెజారిటీ సాధిస్తుందని మా విశ్వాసం.

మళ్లీ కుప్పంలో పోటీ చేయాలంటే చంద్రబాబుకు ధైర్యం సరిపోతుందా? రాజకీయాల్లో వుండగలవా? చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావో తేల్చుకో.