శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:00 IST)

చంద్రబాబు కుప్పం వదిలి మరో చోటికి వెళ్లిపోతాడేమో?: మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ

కుప్పంలో టీడీపీ కుప్పకూలిపోయిందని, చంద్రబాబు కోట బద్ధలై పోయింది అని ఈరోజు వస్తోన్న పంచాయతీ మూడో విడత ఫలితాలు చూస్తే తేటతెల్లమవుతోందని మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వారు విలేఖరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...
 
"కుప్పంలో టీడీపీ కుప్పకూలిపోయిందని, చంద్రబాబు కోట బద్ధలై పోయింది అని ఈరోజు వస్తోన్న పంచాయతీ మూడో విడత ఫలితాలు చూస్తే తేటతెల్లమవుతోంది. ఈ ఫలితాలు చూసి మేమేం పెద్దగా ఆశ్చర్య పడడం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది చంద్రబాబు ఓటమిని కాదు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి, ఆయనపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేస్తున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు కానివ్వండి. ఆయన పనితీరు కానివ్వండి. ఇవాళ క్షేత్రస్థాయిలో ఏదైతే ప్రభావం చూపిస్తుందో.. సామాన్యులలో కూడా జగనన్నకు అన్ని స్థాయలలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న భావన రావడం వల్లే ఇవాళ ఈ ఫలితం సాధ్యమైందని నేను అనుకుంటున్నాను.
 
కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పకూలి పోయింది అంటే అది కొత్తగా ఏమీ అనిపించడం లేదు. ఎందుకంటే కుప్పం ఏమీ ఈ ఒరవడికి, ఫ్యాన్‌ గాలికి అతీతం కాదు. ఎందుకంటే మొన్న జనరల్ ఎన్నికల్లో మంగళగిరిలో కూడా వాళ్లు ఓడిపోయారు. టీడీపీకి 23 స్థానాలే వచ్చాయి. అదే పరిస్థితి ఇవాళ్టికి ఉంది. అంతకు మించి బ్రహ్మాండంగా పరిపాలన ఉందని చెప్పి, 18 నెలల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి అర్ధం అవుతోంది.
 
చంద్రబాబు కుప్పం వదిలి మరో చోటికి వెళ్లిపోతాడేమో?:
ఇంకా చెప్పాలంటే మోకాలు అడ్డు పెడితేనో, అర చేయి అడ్డు పెడితేనో సూర్యకాంతి ఆగిపోదు అన్నట్లుగా.. ఇవాళ ఎవరు అడ్డుపడినా, ఎవరు సహాయం చేసినా ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా చూశారు. చాలా చిత్రం ఏమిటంటే, గతంలో చంద్రగిరి నుంచి చంద్రబాబు కుప్పం వెళ్లిపోయాడు.

మళ్లీ ఇప్పుడు కుప్పం నుంచి కొత్త నియోజకవర్గం వెతుక్కుంటే వెతుక్కోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్థితి అంతా ఒకే విధంగా ఉంది. బహుశా అది జాతీయ పార్టీ కాబట్టి, ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి, ఇటు తెలంగాణ నుంచి అటు అండమాన్‌ వరకు ఆయన పార్టీ ఉంది. కాబట్టి ఎక్కడైనా వెతుక్కుంటే వెతుక్కోవచ్చు. అండమాన్‌ నికోబార్‌లో కూడా వారి పార్టీ ఉంది కాబట్టి, చంద్రబాబు అక్కడికి వెళ్తారేమో అని మా వాళ్లంతా అంటున్నారు. ఎందుకంటే కుప్పం పూర్తిగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది కాబట్టి.
 
ఇప్పటికైనా సమీక్షించుకోవాలి:
కుప్పం లాంటి కంచుకోటలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకునే నాయకుడు ఉన్న దగ్గర దాదాపు 89 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 70 స్థానాలలో మేము అంటే వైఎస్సార్సీపీ గెలుపొందే కార్యక్రమం జరుగుతూ ఉందంటే అర్ధం ఏమిటి?.

దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి అంటే, జగన్‌మోహన్‌రెడ్డి గారి పరిపాలనకు ప్రజలంతా ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నారని మీరు అర్ధం చేసుకోవాలి. అంతే కానీ రోజువారీగా వచ్చి, రోడ్డెక్కి, బకెట్ల కొద్దీ బురద తెచ్చి ప్రభుత్వం మీద, జగన్‌మోహన్‌రెడ్డి మీద చల్లడం.. ఇప్పటికైనా మీ మనసు మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటారు. అన్నీ తెలిసిన వారు. కాబట్టి ప్రజామోదం తెలిసిన తర్వాత అయినా వాళ్ల మనసు మారాలి.
 
ఈ ఫలితం ఒక చెంపపెట్టు:
18 నెలల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, ముఖ్యమంత్రి గారు పని చేయడం లేదని ప్రచారం చేస్తున్న తండ్రీ కొడుకులకు, కుప్పం ఫలితం అనేది ఒక చెంపపెట్టు. అందుకే వారు సమీక్షించుకోవాలి. కానీ సమీక్ష చేసుకోరనే అనుకుంటున్నాను. ఎందుంటే చాలా నిజాలు బయటకు వస్తాయి.

అది తట్టుకోలేరు వారు. అది అంతర్జాతీయ పార్టీ. చాలా రాష్ట్రాలలో కూడా ఉంది. తెలంగాణా, ఒడిసాలో కూడా ఉందని చెబుతారు. కానీ ఈ రాష్ట్రంలోనే కూకటివేళ్లతో సహా కదిలి పోతోంది. చంద్రబాబు నాయుడు పీటం కదిలి పోతోంది. మేమేం చెబుతున్నాం అంటే, ఇది చంద్రబాబు నాయుడు పని తీరుతో వచ్చిన ఓటమి కాదు. జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మి, ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు అని చెబుతున్నాం.

ఒక్క కుప్పం మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 పంచాయతీలలో ఎన్నికలు జరిగితే, దాదాపు 85 శాతం పంచాయతీలు వైయస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చాయి. మేము ఒకటే చెబుతున్నాం. చాలా కింది స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఇస్తున్న తీర్పు ఇది అని నమ్ముతున్నాం.
 
బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ మంత్రి మాట్లాడుతూ..
‘ఇవాళ్టి ఫలితాలలో దాదాపు 90 శాతం జగన్‌మోహన్‌రెడ్డి గారి పరిపాలనను, ఆయన నాయకత్వాన్ని బలపర్చారు. గత రెండు విడతల్లో కూడా దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. ఆరోజే చెప్పాం విడత విడతకూ ఫలితాలు పెరుగుతాయని చెప్పాం. ఇప్పుడు కూడా 80 శాతానికి పైగా ఫలితాల వస్తున్నాయి.

ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఇస్తున్న ప్రభుత్వం ఇది. ఏం జరిగినా సీఎం గారు స్వయంగా సమీక్షిస్తున్నారు. స్పందిస్తున్నారు. సేవలందిస్తున్నారు. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందుకే ప్రజలు ఆనందంగా ఓటేస్తున్నారు’
 
అయినా వారు బుకాయిస్తున్నారు:
‘చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకలు ప్రతిదీ బుకాయిస్తున్నారు. కింద పడ్డా తమదే పైచేయి అంటున్నారు. ఈరోజు కూడా దాదాపు 90 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అదే విధంగా నాలుగో విడతలో కూడా వస్తాయని ఆశిస్తున్నాం. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం’.
 
ఎందుకంటే..?:
‘ఎందుకంటే ఇవాళ పట్టణాలలో మనం చూశాం. దేశంలో గతంలో ఎక్కడా లేని విధంగా, పట్టణ ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. విశాఖతో పాటు, మరో 15 పట్టణాలకు ప్రత్యేక గురింపు వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారి జరిగింది. విశాఖకు దేశంలోనే మూడో స్థానం వచ్చింది. దీనంతటికి కారణం ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పధకాలు. ఆ స్ఫూర్తితోనే ఇంకా ఈ ప్రభుత్వ పని చేస్తుంది. ప్రజలు కూడా తప్పకుండా ఆదరిస్తారు’.
 
బాధ్యత మరింత పెరిగింది:
‘రేపు జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయి. ఆ విధంగా మా బాధ్యత కూడా పెరుగుతుంది. మేము కచ్చితంగా ఇంకా మంచి చేస్తాము. ఇప్పటికైనా ఈ ఫలితాలు చూసి, విపక్షం తన ఆలోచన మార్చుకోవాలి. మాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి, ప్రజలకు ఇంకా ఎంతో చేసే బాధ్యత మాపై ఉంచారని మేము అనుకుంటున్నాం. ఆ దిశలో కచ్చితంగా పని చేస్తాం’.
 
మల్లాది విష్ణు. ఎమ్మెల్యే:
‘ఈరోజు మూడో విడతలో కూడా ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చాయి. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన విధానానికి క్షేత్ర స్థాయిలో సామాన్యులు మొదలు.. ఆఖరికి చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు  నియోజకవర్గంలో కూడా ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూడండి. మా ఎజెండా, మా పనితీరు ఈరోజు మూడో విడతలో కూడా గెలిపించింది.

చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు రోజూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మా వెంట ఉన్నప్పటికీ దానికి మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఉన్న ఎల్లో మీడియా కానీ, సోషల్‌ మీడియా ద్వారా కానీ ఆ ప్రచారం చేస్తున్నారు. కానీ అవేవీ గత ఏ ఎన్నికల్లోనూ పని చేయలేదు’.