సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 29 జనవరి 2021 (15:51 IST)

నిమ్మగడ్డలో "చంద్ర"ముఖి, అందుకే ప్రతిసారీ లకలకలక: విజయసాయి రజినీ డైలాగ్

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సీఈసి రమేష్ కుమార్‌తో పాటు చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటల్లోనే... మొట్టమొదటి నుంచీ ఎస్ఈసీగా ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించకుండా పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడు. గతంలో కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుంటే.. చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు, ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలను నిలిపివేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్.
 
ఆనాడు కరోనా పేరు చెప్పి ఎన్నికలు నిలిపివేసి, ఇప్పుడు కరోనా తగ్గకపోయినా.. చంద్రబాబుతో లాలూచీపడి, హఠాత్తుగా తిరిగి పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత చౌకబారుగా వ్యవహరించటం దురదృష్టకరం.
 
పంచాయితీ ఎన్నికలు అంటే పార్టీ రహితంగా జరుగుతాయి. దానికి సింబల్స్ ఉండవు. అటువంటిది 40 ఇయర్స్ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పంచాయితీ ఎన్నికలకు ఏవిధంగా ఒక మేనిఫెస్టో ను  విడుదల చేస్తాడు. ఆయన అనుభవం గాలికి వెళ్ళిందా..? పంచాయితీ ఎన్నికల్లో కనీసం పార్టీ గుర్తులు ఉండవని కూడా చంద్రబాబుకు తెలియదా..?
 
బహుశా పంచాయితీ ఎన్నికలు చంద్రబాబుకు ఆఖరి ఎన్నికలు ఏమో.. 2024 వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందా.. ఉండదా.. అన్న సందేహం చంద్రబాబుకు వచ్చి ఉంటుంది. ఆయన చివరి కోరిక ప్రకారమే మేనిఫెస్టో విడుదల చేశాడేమో.. చంద్రబాబు విడుదల చేసిన పంచాయితీ మేనిఫెస్టోలో పైన మూడు బొమ్మలు.. కింద రెండు బొమ్మలు పెట్టాడు. అందులో మొదట బొమ్మ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తన కొడుకు లోకేష్‌ది, రెండోది బతికుండగానే అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురై మరణించిన ఎన్టీఆర్‌ది. మూడోది సొంత నియోజకవర్గంలో దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు బొమ్మ.
 
నాలుగోది వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు, గత ఎన్నికల్లో 23 సీట్లు తెచ్చుకున్నానన్న మహానందంతో పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన మహా నాయకుడు చంద్రబాబు ఫోటో.. ముద్రించుకున్నారు. అసలు పార్టీలరహితంగా జరిగే పంచాయితీ ఎన్నికలను రాజకీయం చేయడం, ఆ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడమే చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధంగా మేనిఫెస్టోని విడుదల చేసిన చంద్రబాబు మీద ఇప్పటివరకూ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోలేదు.
 
నిమ్మగడ్డ మాట్లాడితే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద చర్యలు, ప్రభుత్వం మీద చర్యలు, ఎంపీల మీద చర్యలు, అడ్వైజర్ల మీద చర్యలు అంటాడు. మరి పార్టీలకు అతీతంగా జరిగే పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకుంటున్నాడు. చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘన మీద నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా.. లేదా? టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా.. లేదా..?
 
ప్రతి చిన్నదానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళతానంటాడు, లంచ్ మోషన్, హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు.. మరొకటి అంటాడు.. ఇలా మతిభ్రమించినట్టు మాట్లాడుతున్న నిమ్మగడ్డ ఒక మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్. ఇటువంటి వ్యక్తిని రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. మెంటల్లీ సౌండ్ పర్సన్లు మాత్రమే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండాలి. తక్షణం నిమ్మగడ్డ మానసిక పరిస్థితిపై మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి, ఆయన మైండ్ సరిగా ఉందా.. లేదా అని మెడికల్ ఇన్విస్టిగేషన్ జరగాలి. అప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, స్థానిక సంస్థలు సజావుగా జరుగుతాయి.
 
శరీరం మాత్రమే నిమ్మగడ్డది. చంద్రబాబు నాయుడు చంద్రముఖి రూపంలో నిమ్మగడ్డలో ఆవహించి లకలక అని ఆడిస్తూ ఉన్నాడు. పైకి మాత్రం ధర్మం, న్యాయం అంటూ నిమ్మగడ్డ ప్రవచనాలు చెప్పటంలో  చాగంటి, ఉషశ్రీ, గరికపాటిలను మించి పోతున్నాడు. ఎస్ఈసీ నిమ్మగడ్డను సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2018లో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలను ఎందుకు జరిపించలేదు. అంటే  2018 నుంచి 2021 వరకు నిమ్మగడ్డ ఎన్నికలు పెట్టకుండా నిద్రపోతూ ఉన్నారా.. ? కలెక్టర్లను, ఎస్పీలను, ఉన్నతాధికారులను  బదిలీ చేస్తాను.. సస్పెండ్ చేస్తాను.. అంటూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అందరిలో ఒక భయానకరమైన వాతావరణం కల్పించి.. వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించకుండా చేసి చంద్రముఖి ఆవహించినట్టుగా నిమ్మగడ్డ  లకలక అని అరుస్తున్నాడు.
 
నిమ్మగడ్డ కు చిత్తశుద్ధి ఉంటే.. చంద్రబాబు మీద ఈపాటికే.. కోర్టుల్లోనో, లేక అతని విచక్షణాధికారాలతోనో ఏదో ఒక మోషన్ మూవ్ చేయాలి కదా.. ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదంటే.. చంద్రబాబు-నిమ్మగడ్డ ఒక్కరే. చంద్రబాబుకు నిమ్మగడ్డ తొత్తు. నిమ్మగడ్డ.. కందగడ్డ.. ఉల్లిగడ్డ.. చేమగడ్డ అన్నది అర్థం కావడం లేదు. ఆయన వ్యవహారాన్ని చూస్తే.. ఇతన్ని కచ్చితంగా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. ఎర్రగడ్డకు పంపించే అర్హత నిమ్మగడ్డకు ఉంది.
 
నిమ్మగడ్డ .. నా ఓటును నిరాకరించారంటాడు. ఆయనకు ఓటు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేయాలి. ఓటు హక్కు పొందడంలో ఆయన కూడా ఒక సాధారణ పౌరుడే.. దానర్థం కూడా తెలియకుండా రాజ్యాంగ పదవిలో నిమ్మగడ్డ ఎలా ఉన్నారు..? అందుకే అంటున్నాం నిమ్మగడ్డకు తెల్సింది.. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు.. రిప్రజెంటేషన్ ఆఫ్ టీడీపీ యాక్ట్ అని. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తెలియని వారు ఎన్నికల కమిషనర్‌గా కొనసాగడం కరెక్టా..?  నిమ్మగడ్డ స్టేట్ ఎలక్షన్ కమిషనరా.. లేక టీడీపీ కమిషనరా.. అన్నది అర్థం కావటం లేదు.