శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (10:41 IST)

డ్రైవింగ్ సీటును పవిత్రమైన స్థానంగా భావించాలి: మంత్రి కొడాలి నాని

డ్రైవింగ్ సీటులో కూర్చొనే డ్రైవర్లు ఆ స్థానాన్ని పవిత్రమైన స్థానంగా భావించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని సూచించారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన డ్రైవర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు.

డ్రైవింగ్ పై అనేక మెళకువలను తెలియజేశారు . డ్రైవింగ్ స్కూల్ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కాళ్ళు , చేతులతో కన్నా బ్రెయిన్ తో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నారు.

డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్ చేస్తేనే వారి కుటుంబాలు బాగుంటాయన్నారు . కొద్దిపాటి అజాగ్రత్త , నిర్లక్ష్యంగా , సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే మనతో పాటు రోడ్డుపై వెళ్ళే ప్రయాణీకులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ అనేది ఒక వృత్తి అని, దీన్ని చేసేవారికి అది ఒక జీవితమన్నారు.

డ్రైవింగ్ సీటులో కూర్చొన్న మొదటి నిమిషం నుండి గమ్యస్థానం చేరుకునే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు . కొద్ది సమయం తర్వాత అలసిపోవడం, నిద్రలోకి జారుకోవడం వంటివి చేయరాదన్నారు. డ్రైవరకు ఉండాల్సింది ఓర్పు అలా లేనప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకోవాలన్నారు.

డ్రైవింగ్ చేసేటపుడు నిద్ర వస్తే దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదన్నారు. చర్చి, గుడి, మసీదుకు వెళ్ళినపుడు ఎంత పవిత్రంగా ఉంటామో డ్రైవింగ్ సీటులో కూర్చొన్నపుడు కూడా అంతే పవిత్రంగా ఉండాలన్నారు . ఏ చిన్న పొరపాటు జరిగినా మనతో పాటు ప్రమాదానికి గురైన వారు కూడా ఉండరన్నారు.

డ్రైవింగ్ సీటులో కూర్చొన్నపుడు అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితులు ఉడకూడదన్నారు . మద్యం తీసుకుంటే డ్రైవింగ్ చేసి అలసిపోయిన స్థితిలో నిద్ర వస్తుందన్నారు . బ్రెయిన్ కూడా పనిచేసే పరిస్థితి ఉండదన్నారు . డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలన్నారు.

డ్రైవర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు . ఇప్పుడున్న బస్సుల కండిషన్ , 30 ఏళ్ళ కిందట లారీలు , బస్సుల కండిషన్‌కు సంబంధం లేదన్నారు. అధునాతనమైన వాహనాలను ఇప్పటి డ్రైవర్లు తోలుతున్నారన్నారు.

డ్రైవింగ్ స్కూల్స్ లో అంబాసిడర్ కారు, 370 ఇంజన్లు, ఆయిల్ బ్రేక్ లు కల్గిన వాహనాలు ఉండేవన్నారు . వీటిని తోలిన వారు ఇప్పటి వాహనాలను తోలితే అవి తోలినట్టుగా ఉ అడవన్నారు . ఎక్సలేటర్ పై కాలు తీస్తే ఇంజన్ ఆగిపోతుందని , ఇంజన్ ఆగితే సెల్ఫ్ లేక స్టార్ట్ అయ్యేది కాదని, ఆ సమయంలో బ్రేక్ వాడాల్సి వస్తుందని , ఒకే కాలును ఎక్స్ లేటర్, బ్రేక్ కు వినియోగించాల్సి వచ్చేదన్నారు.

ఇంజన్ ఆగకుండా ఎక్సలేటర్ కు ఇటుకరాయి కట్టేవారన్నారు . ఎత్తుపల్లాలు వచ్చినపుడు ఇటుకరాయి పైకి , కిందకి కదిలినపుడు ఇంజన్ ఆగిపోయేదన్నారు . ఆయిల్ బ్రేక్ రెండు , మూడుసార్లు వేస్తేగాని వాహనం ఆగేది కాదన్నారు . స్టీరింగ్ కు ప్లే రెండు రౌండ్లు ఉండేదన్నారు.

టర్నింగ్ వచ్చినపుడు ముందుగానే స్టీరింగ్ ను ఒక రౌండ్ తిప్పి పెట్టుకోవాల్సి వచ్చేదన్నారు . పాత తరం వాహనాలను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి కూడా చూపించి వాటిపై డ్రైవింగ్ చేయించాలని సూచించారు. గతంలో ఆరేడు సంవత్సరాలు క్లీనర్ గా పనిచేసిన తర్వాతే డ్రైవింగ్ సీటులో కూర్చోనిచ్చేవారన్నారు.

ప్రస్తుతం అద్భుతమైన టెక్నాలజీతో వాహనాలు తయారవుతున్నాయని, ఇప్పటి డ్రైవర్లు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదన్నారు . బయట రాష్ట్రాలకు వెళ్ళే డ్రైవర్లు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు.

అనంతరం మంత్రి కొడాలి నానిని దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాల్టి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, మోటారు వెహికల్ ఇన్స్ పెక్టర్లు మురళీకృష్ణ, స్వామినాయుడు, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నల్లాని వెంకట్రావు , ఇన్ స్పక్టర్లు వెంకటేశ్వరరెడ్డి , శ్రీనివాసరావు , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.