ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (19:41 IST)

ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? : చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేయడం పౌరహక్కుల ఉల్లంఘన అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావం జగన్‌ రెడ్డిది. జగన్‌ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిపోయింది. నిన్న నెల్లూరులో ఒక ఎమ్మెల్యే జిల్లా ఎస్పీని బహిరంగంగా బెదిరింపులకు దిగితే, నేడు ఒక మంత్రి దాడులకు పాల్పడతానంటూ మాట్లాడుతున్నారు. 
 
జగన్‌రెడ్డి ప్రోద్భలంతోనే వైసీపీ నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. దేవినేని ఉమా ఇంటికి వచ్చి బడితెపూజ చేస్తామంటూ నేరపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై ఇంతవరకు కేసు నమోదు చేయకుండా తెదేపా నేతలను అదుపులోకి తీసుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? 
 
అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారు. అరెస్టు చేసిన తెలుగుదేశంపార్టీ నేతలను వెంటనే విడుదల చేసి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.