మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (12:48 IST)

పొరుగు సీఎం మాటలు విని పోలవరం ఎత్తు తగ్గించారు : దేవినేని ఉమ

పక్క రాష్ట్ర భూభాగం నుంచి ఏపీకి నీళ్లు తెస్తానన్న జగన్, నేడు పొరుగు రాష్ట్ర సీఎం మాటవిని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, 194.06 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యమున్న పోలవరం ప్రాజెక్టుని, 3.57 మీటర్ల వరకు ఎత్తు తగ్గించి, నీటినిల్వ సామర్థం తగ్గేలా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. 
 
లక్షలాది మంది నిర్వాసితులు, రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకునే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు? నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.27,500 కోట్ల సంగతేమిటి? ఏపీలో కలిపిన ఏడుముంపు మండలాల పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగానే ఉన్నారని, సెప్టెంబర్ 15, 2019న పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితే, ఏపీ ముఖ్యమంత్రి, ఆ మాటలను ఖండించిన పాపానపోలేదు. మే 20నాటికే 18 వేలమంది నిర్వాసితుల కుటుంబాలను ఇళ్లల్లోకి చేరుస్తామన్న ఉత్తరకుమార మంత్రి ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదు? 
 
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఇతరేతర సమస్యల గురించి ముఖ్యమంత్రి కనీసం రికార్డెడ్ ప్రెస్ మీట్లు కూడా ఎందుకు పెట్టడంలేదు అని నిలదీశారు. నిజంగా పోలవరం నిధుల గురించే జగన్, ప్రధానికి, ఇతర మంత్రులకు లేఖలు రాసి ఉంటే, అవన్నీ ఎందుకు ప్రజలముందు ఉంచడం లేదు? 45.72 మీటర్లకు తగ్గకుండా ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి, అంటే 150 అడుగుల ఎత్తులో పోలవరం డ్యాంలో నీరు నిల్వచేయాలి. రూ.27 వేల 500 కోట్ల వరకు నిర్వాసితులకు డబ్బులు చెల్లించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. 

ముఖ్యమంత్రి స్వయంగా మీడియా ముందుకొచ్చి తాము అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. లేకుంటే రాష్ట్రరైతాంగం తరుపున, నిర్వాసితుల తరపున, సమాధానం చెప్పేవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. జగన్ పాదయాత్ర సమయంలో చెప్పినట్లుగా నిర్వాసితులకు సంబంధించిన సొమ్ముతాలూకా జీవోని విడుదలచేయాలి.

లోక్‌సభ, రాజ్యసభలో 28 మంది ఎంపీలుండి కూడా పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,48 కోట్లకు జగన్మోహన్ రెడ్డి ఆమోదిపంచేసుకోలేకపోయాడు. ఈచేతగాని, అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ రంగానికి చేసిన ఖర్చు కేవలం రూ.1000 కోట్లే. 
 
దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఎక్కడా జరగని విధంగా, చంద్రబాబు ప్రభుత్వంలో 71 శాతానికి పైగా పనులు జరిగాయి. కేంద్ర జలవనరులశాఖా మంత్రిని తీసుకొచ్చి మరీ డ్యామ్ సైట్ పనులు చూపించాం. జరుగుతున్న పనుల్లో 32వేల క్యూబిక్ మీటర్లదాకా కాంక్రీట్ పనులు చేసి, గిన్నిస్ రికార్డులో ఎక్కేలా చేశాము. 
 
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి పోలవరాన్ని పడుకోబెట్టింది. రెండేళ్లలో పోలవరం పూర్తిచేయకపోతే, తమ ఆఫీసు మూసేస్తామన్న వారు ఇప్పుడేం సమాధానం చెబుతారో చెప్పాలి. బూతుల మంత్రులతో బూతులు మాట్లాడించకుండా, ముఖ్యమంత్రే మీడియా ముందుకొచ్చి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాలి. 
 
పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర జలవనరుల మంత్రలు షెడ్యూళ్లు అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ రెడ్డి విజయసాయి షెడ్యూళ్లు ఫిక్స్ చేస్తున్నాడు వారి వైఖరిని బట్టే అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమంటే, ఈ ప్రభుత్వానికి ఎంతటి నవ్వులాటగా ఉందని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు.