ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (04:14 IST)

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు చంద్రబాబు 20 లక్షల సహాయం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్య, కూతుళ్ళను దారుణంగా హత్య చేసిన నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఈ కుటుంబంలో మిగిలిన ఉన్న లక్ష్మీ ప్రసన్నకు రూ. 20 లక్షల సహాయాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అంత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్య, కూతుళ్ళను దారుణంగా హత్య చేసిన నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఈ కుటుంబంలో మిగిలిన ఉన్న లక్ష్మీ ప్రసన్నకు రూ. 20 లక్షల సహాయాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అంతేకాదు ఆమె చదువుకు అయ్యే ఖర్చును కూడ భరించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి ఘటనలపై సమాజంలో చర్చ జరగాలని, మానవత్వాన్ని అందరం పరిరక్షించాలని చంద్రబాబు సూచించారు. 
 
 
అప్పులు కలహాలు తాడిపత్రిలోని ఆ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న పిల్లల జీవితాలను నాశనం చేశాయి. మంగళవారం తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి భార్య సులోచన, కుమార్తెలు ప్రతిభ, ప్రత్యూషలను దారుణంగా హతమార్చాడు. పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఇంట్లో లేనందున తప్పించుకుంది. మానవత్వం మరిచి అయినవాళ్లను హత్య చేసి పరారైన రామసుబ్బారెడ్డి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వరుస ఘటనలపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి రామసుబ్బారెడ్డి పెద్దకుమార్తె లక్ష్మీ ప్రసన్నను పరామర్శించారు. ఆమెను ఘటన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. రాజకుమారి బాధితురాలిని ఓదార్చారు.ఆమెను అన్నిరకాలుగా ఆదుకొంటామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య, బిడ్డలను హత్యచేయడం చాలా దారుణమని, వారి మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి రైతు కృతజ్ఞత సభ వద్దకు ప్రసన్నను తీసుకెళ్లారు. అక్కడ ప్రసన్నతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై సమాజం స్పందించాలని పిలుపునిచ్చారు. 
 
"అమ్మానాన్న చెల్లెళ్లు అందరినీ కోల్పోయింది. సమాజం మొత్తంగా మీకు అండగా ఉంటాం. ఎప్పుడు నువ్వు నన్ను కలవాలన్నా ధైర్యంగా ఉండు.. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత, నీ భవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యత, నీకు తల్లీ తండ్రీ లేని లోటును తీర్చే బాధ్యతను వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇప్పుడే ప్రభాకరరెడ్డికి చెప్పాను. ఎమ్మెల్యేకి చెప్పాను. ఆ 14 ఎకరాల భూమిపై ఎవరైతే అప్పులు ఇచ్చారో వారందరినీ పిలిపించి ఆ వ్యవహారం సెటిల్ చేయమని కలెక్టరుకు చెప్పాను. ఆ సమస్యను సెటిల్ చేసిన తర్వాత అవసరమైతే ప్రభాకరరెడ్డి తన ట్రస్టు ద్వారా ఈ అమ్మాయిని చదివిస్తానన్నాడు. నేనయితే 20 లక్షల రూపాయలను ఈ అమ్మాయి పేరుతో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తున్నాను." అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. 
 
తన తండ్రి రామసుబ్బారెడ్డి , తల్లి, ఇద్దరి చెల్లెళ్ళను కిరాతకంగా హత్య చేశాడని ప్రసన్న చెప్పింది. ముక్తాపూర్ లో నిర్వహించిన సభలో బాధితురాలు మాట్లాడింది. రామసుబ్బారెడ్డి లాంటి వ్యక్తిని తన తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్టుగా ఆమె ప్రకటించింది. అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపారని ఆమె సభలో కన్నీళ్ళు పెట్టుకొంటూ చెప్పారు. 
 
ఆత్మీయులు, ప్రభుత్వం అండగా నిలిచినందున కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రసన్న తెలిపింది. తల్లిదండ్రులెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని వేడుకుంది.  ఆమె మాటల్లోనే...
 
"మా అమ్మ, ఇద్దరు చెల్లెళ్లను మానాన్న అతి కిరాతకంగా చంపారు. నాన్న కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అసలు మా నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. అమ్మ, చెల్లెళ్లు, నాన్న అందరూ చనిపోయాక నేనుండి మాత్రం ఏం ప్రయోజనం.. నేను కూడా వాళ్లతో పాటు వెళ్లిపోదామని అనుకున్నాను. సిఎంగారు, ఎమ్మెల్యే గారు, రాజకుమారి మేడమ్ గారు ఇచ్చిన ధైర్యంతో అమ్మ నన్ను ఏ స్థానంలో చూడాలనుకుంటుందో ఆ పొజిషన్‌కి చేరాలని కోరుకుంటున్నాను."
 
అయితే తండ్రి మృతదేహన్ని చూసేందుకు కూడ ప్రసన్న తొలుత ఇష్టపడలేదు. అయితే కన్నతండ్రి చివరిసారిగా చూసేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసేందుకు ప్రసన్న వెళ్లడం అందరినీ కంట తడిపెట్టించింది. కిరాతకంగా వ్యవహరించిన తండ్రిపై మానవత్వం చూపింది.