సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 31 జులై 2016 (14:59 IST)

మద్రాసు To కర్నూలు-హైదరాబాదు: భాగ్యనగరం నుంచి అప్పులతో ఇక్కడికొచ్చాం.. ఇక కుదరంతే!!

మద్రాసు నుంచి కర్నూలుకు కట్టుబట్టలతో వచ్చాం. అక్కడ నుంచి హైదరాబాదుకు వెళ్లాం. అక్కడ నుంచి ప్రస్తుతం అప్పులతో విజయవాడకు వచ్చాం.. ప్రతీసారి అన్యాయమే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కోరడంతో రాజధానిగా ఉన్న హైద

మద్రాసు నుంచి కర్నూలుకు కట్టుబట్టలతో వచ్చాం. అక్కడ నుంచి హైదరాబాదుకు వెళ్లాం. అక్కడ నుంచి ప్రస్తుతం అప్పులతో విజయవాడకు వచ్చాం.. ప్రతీసారి అన్యాయమే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కోరడంతో రాజధానిగా ఉన్న హైదరాబాదును వదిలేయాల్సి వచ్చింది. అలా అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. బహిరంగ సభల్లో ప్రకటించారు. అది ఇప్పుడు కుదరదని చెప్తే ఎలా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
నాడు హోదాపై అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు అర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం ఉందన్న విషయం నాడు గుర్తుకు రాలేదా అని అడిగిన చంద్రబాబు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోమని తెలిపారు.
 
ఇంకా వనరులు లేవనుకున్నప్పుడు సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలెందుకు విభజించారని చంద్రబాబు అడిగారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవమని, నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వెల్లడించారు. ఆదివారం ఎంపీలు, మంత్రులతో సమావేశమై ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ తరువాత పార్టీ ఎలా ముందుకెళ్లాలో సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్‌మెంట్ కోరామని.. ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా అంశంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు. ఇందులో భాగంగా సోమవారం  మంత్రులు, ఎంపీలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నామని తెలిపారు. 
 
రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నప్పుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని బీజేపీని ప్రశ్నించిన చంద్రబాబు, రేపు రాష్ట్ర అవసరాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 23 సార్లు ఢిల్లీకి వెళ్లానని.. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రాన్ని అనేక విధాలుగా విజ్ఞప్తి చేశానని.. ఇకపై ఢిల్లీకి వెళ్లనని తమ ఎంపీలు చూసుకుంటారని చంద్రబాబు అన్నారు. 
 
నాడు విభజనకు అన్ని పార్టీలూ అంగీకరించాయని, మెజారిటీ పార్టీలన్నీ హోదా, విభజన చట్టానికి అనుకూలమేనన్న సంకేతాలను పార్లమెంటు సాక్షిగా ఇచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పని వల్లే ప్రత్యేక హోదా అంశంపై పక్కకెళ్లిపోయిందన్నారు. 
 
రాష్ట్ర విభజన జరగాల్సిన పరిస్థితి నెలకొన్నప్పుడు అరగంట సమయంలో పార్లమెంట్ గదులు మూతబెట్టి బిల్లును పాస్ చేసిన కాంగ్రెస్ హోదాపై చట్టం పెట్టలేకపోయిందని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ కూడా అప్పట్లో హోదాపై పట్టుబట్టిందని చెప్పారు. ఆపై ఎన్నికల్లోనూ హామీలిచ్చారని.. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసిన చంద్రబాబు, ప్రజల సెంటిమెంటుతో ఆడుకోవద్దని హితవు పలికారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం తమకు, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కానేకాదని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలుపుతామని అన్నారు. 
 
విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు కలిసికట్టుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి వుందని, అందుకు ప్రత్యేక హోదాతో పాటు అదనపు నిధులను, పన్ను రాయితీలనూ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని తాను మొదటి నుంచే వాదిస్తున్నానని, ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.