బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (09:29 IST)

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

delhi ganesh
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ శనివాం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయసు 80 యేళఅలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నై నగరంలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు గణేశన్. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీ గణేశ్‌గా పేరు మార్చుకున్నారు. ఈ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. 
 
కాగా, 1944 ఆగస్టు ఒకటో తేదీన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వెలిలో ఆయన జన్మించారు. దర్శక దిగ్గజం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'పట్టిన ప్రవేశం' చిత్రంతో నటుడిగా ఆయన వెండితెర ప్రవేశం చేశారు. 1981లో 'ఎంగమ్మ మహారాణి' చిత్రంలో హీరోగా నటించారు. అక్కడి నుంచి తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించారు. 
 
సినిమాల్లోకి రావడానికంటే ముందు ఆయన ఢిల్లీకి సంబంధించిన థియేటర్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నారు. 1964 నుంచి 1974 వరకూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు తన సేవల్ని అందించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. గణేశన్‌ను నటుడిగా పరిచయం చేసిన కె.బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్ అని నామకరణం చేశారు. 
 
సినిమాల్లో ఎక్కువగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కనిపించారు. అందులోనూ వైవిధ్యమైన పాత్రలనే ఎంపిక చేసుకుని కమెడీయన్‌గా, విలన్, తండ్రిగా, అన్నగా ఎన్నో రకాల పాత్రలతో అలరించారు. అంతేకాదు టీవీ సీరియళ్లలో ఆయన మంచి గుర్తింపు ఉంది. సింధుభైరవి, అపూర్వ సహోదరులు, నాయకన్, మైఖేల్ మదన కామరాజు, ఆహా, తెనాలి వంటి చిత్రాలకు ఆయనకు చక్కని గుర్తింపు తీసుకొచ్చాయి. 
 
'పసి' (1979) చిత్రానికిగానూ తమిళనాడు రాష్ట్ర అవార్డు వరించింది. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన నటుడిగా కొనసాగారు. చివరిగా ఆయన ఈ ఏడాది విడుదలైన 'ఆరణ్మనై 4', 'రత్నం', 'ఇండియన్ 2' చిత్రాల్లో కనిపించారు. ఆయన మృతిపట్ల చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపింది. 
 
కేవలం సినిమా నటుడుగానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్టుగా షార్ట్ ఫిల్మ్స్‌లలో నటించి అనేక మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. 47 నాట్కల్ అనే తమిళ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి పాత్రకు, గిరీశ్ కర్నాడ్ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.