శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (23:04 IST)

వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్ల కన్ఫర్మ్‌ కోసం ఎంపీ/ఎమ్‌ఎల్‌ఏల నకిలీ లెటర్‌ హెడ్స్‌తో మోసం

రైల్వే టిక్కెట్ల కన్ఫర్మ్‌ కోసం వివిధ రాష్ట్రాల ఎంపీల, ఎమ్‌ఎల్‌ఏల నకిలీ లెటర్‌హెడ్స్‌పై అభ్యర్థనలు పంపుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిరి ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు.
 
గోవా, మహారాష్ట్ర, యూపీ, ఒడిస్సా, కేరళ మొదలగు రాష్రాలకు సంబంధించి ఎంపీలు/ఎమ్‌ఎల్‌ఏల 9 లెటర్‌ హెడ్స్‌ నుండి ఒకే రకమైన అభ్యర్థనలు ఈక్యూ సెల్‌కు రావడంతో రైల్వే అధికారులకు అనుమానం వచ్చి విచారించగా ఈ స్కామ్‌ బట్టబయలయ్యింది.
 
ఆర్‌పీఎఫ్‌ సైబర్‌ సెల్‌ సమాచారం ఆధారంగా హైదరాబాద్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌ మరియు మల్కాజిగిరి ఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా వేగవంతంగా జరిపిన విచారణలో హైదరాబాద్‌లోని బొల్లారంలో దిలీప్‌ నాయక్‌ (వయస్సు 33) అనే యువకుడు పట్టుబడ్డాడు. అతనిని విచారించగా ముఖేష్‌ చౌహాన్‌ అనే వ్యక్తి నుండి ఎంపీలు/ఎమ్‌ఎల్‌ఏల నకిలీ లెటర్‌ హెడ్స్‌ను సేకరించి వెయిటింగ్‌ టికెట్ల కన్ఫర్మ్‌ కోసం వాడుతున్నట్టు ఆర్‌పీఎఫ్‌కు తెలియజేశాడు. దీనికి ముఖేష్‌ చౌహన్‌ డబ్బులు వసూలు చేసేవాడు. అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతున్న ముఖేష్‌ చౌహాన్‌ కోసం ఆర్‌పీఎఫ్‌ బృందం గాలించింది.
 
మల్కాజిగిరి ఆర్‌పీఎఫ్‌ బృందం 4.7.2021 తేదీన ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా మల్కాజిగిరిలో అనధికారికంగా రైల్వే టికెట్ల బుకింగ్‌ షాపును నిర్వహిస్తున్న ముఖేష్‌ చౌహాన్‌ పట్టుబడ్డాడు. ఈ దాడులలో ఆర్‌పీఎఫ్‌ బృందం రూ.1,66,476 విలువ గల వాడిన 84 టికెట్లును నిందితుల నుండి  స్వాధీనం చేసుకొని రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది. వారిని విచారించగా ఇంటర్నెట్‌లో ఎంపీల/ఎమ్‌ఎల్‌ఏ లెటర్‌హెడ్స్‌ డౌన్‌లౌడ్‌ చేసుకొని నకిలీ అభ్యర్థనలతో రైల్వే విఐపీ కోటా కింద బెర్త్‌ల కన్ఫర్మ్‌ కోసం ఉపయోగించినట్టు తెలియజేశారు.
 
సదరు ముఠా చేతిలో మోసపోవద్దని, వీటితో వారి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతాయని, అనధికారిక టికెట్లను వినియోగిస్తే నకిలి టికెట్లతో ప్రయాణించినట్టు వారిపై కేసులు నమోదవుతాయని రైల్వే హెచ్చరించింది.
 
స్కామ్‌ను ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మల్కాజిగిరి ఆర్‌పీఎఫ్‌ క్రైమ్‌ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అభినందించారు. ఇటువంటి స్కామ్‌లపై నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రయాణికులు సజావుగా ప్రయాణించడంలో తోడ్పడాలని ఆయన ఆర్‌పీఎఫ్‌కు సూచించారు.