సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (08:18 IST)

అక్కకు తమ్ముడుకి లింకుపెట్టిన బావ.. చంపేసిన బావమరిది

తనను ఎంతో ప్రేమతో పెంచిన అక్కను తరుచుగా బావ అనుమానించడాన్ని బావమరిది జీర్ణించుకోలేకపోయాడు. దీంతో బావను బావమరిది చంపేశాడు. ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాలోని పందివారిపల్లె వడ్డూరు గ్రామానికి చెందిన నాగరాజు (45) భార్య భాగ్యలక్ష్మిని రోజూ మద్యం తాగి వేధించేవాడు. ఈ విషయాన్ని ఆమె వరుసకు తమ్ముడైన నవీన్‌కు చెప్పి బాధపడేది. వీరిద్దరికీ సంబంధం అంటగట్టి వేధించసాగాడు. 
 
ఈ బాధను తట్టుకోలేని వారు నాగరాజును హత్య చేయాలని పథకం పన్నారు. గతనెల 11వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంట్లో పడుకున్న నాగరాజు తలమీద బండరాయితో మోది నవీన్‌ హత్య చేశాడు. ఇందుకు భాగ్యలక్ష్మి సహకరించింది. 
 
అనంతరం మృతదేహం కాళ్లు, తల, చేతులు కత్తితో నరికి ఇంటి సమీపంలోనే గొయ్యితీసి పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు స్థానికంగానే ఉన్నారు. అయితే నాగరాజు కనిపించలేదని బంధువులు వెతకడం మొదలు పెట్టారు. 
 
గత నెల 26వ తేదీ పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. నాగరాజు ఎక్కడికీ వెళ్లినట్టు ఆధారాలు లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తే హత్య సంఘటన వెలుగు చూసింది. 
 
గురువారం మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించి శవపరీక్షలు చేయించారు. నవీన్‌, భాగ్యలక్ష్మిలపై హత్య కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.