ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (09:37 IST)

ఆస్తి తనకు దక్కకుండా చేశాడనీ... నడిరోడ్డుపై అన్నను చంపిన తమ్ముడు

హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై ఓ దారుణం జరిగింది. తనకు ఆస్తి దక్కుండా చేశాడన్న అక్కసుతో నడిరోడ్డుపై అన్నను తమ్ముడు అడ్డంగా నరికేశాడు. ఈ దారుణం గోల్కొండ పోలీస్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన విజయ్‌కుమార్‌(41) అనే వ్యక్తి మణికొండ సెక్రటేరియేట్‌ కాలనీలో చేపలు అమ్ముతున్నాడు. షేక్‌పేట డివిజన్‌ తెరాస నాయకుడిగా ఉన్నాడు. అతడికి తమ్ముళ్లు రవి, సంతోష్‌, నరేందర్‌ అలియాస్‌ చిన్నాకు ఆస్తి విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 
 
రెండేళ్ల క్రితం నరేందర్‌ ఇంటినుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అన్నపై ఆగ్రహంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి షేక్‌పేట నాలా వద్ద విజయ్‌, నరేందర్‌ ఎదురెదురు పడ్డారు. మద్యం మత్తులో ఉన్న నరేందర్‌ ఆస్తి కావాలంటూ డిమాండ్‌ చేశాడు. ఇద్దరిమధ్య వాగ్వాదం పెరిగి కర్రలతో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. చెరుకు రసం విక్రయించే ఓ మహిళ విజయ్‌ చేతిలోని కర్రను లాగేసుకుంది. 
 
నరేందర్‌ తన చేతిలోని కర్రతో తలపై బలంగా కొట్టడంతో విజయ్‌ కుప్పకూలిపోయాడు. నరేందర్‌ కొడుతూనే ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీన్ని అక్కడే ఉన్న కొందరు తమ చరవాణుల్లో చిత్రీకరించారు. అనంతరం నరేందర్‌ బీహెచ్‌ఈఎల్‌లో ఉన్న తమ చిన్నాన్నలు రాజు, విష్ణు వద్దకు వెళ్లిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
 
మృతుడు విజయ్‌పై ముగ్గురు సోదరులకు ఆగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. ఏటీఎం కార్డు విషయంలో విజయ్‌ తనను కొట్టించాడంటూ రవి మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల ఆస్తిని పంపకాలు చేసుకోవాలంటూ నరేందర్‌, రవి, సంతోష్‌ అడుగుతున్నా విజయ్‌ వినక పోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.