సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (08:15 IST)

డేటింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకున్న 60 యేళ్ల వైద్యుడు

హైదరాబాద్ నగరంలో ఓ వైద్యుడు డేటింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకున్నాడు. ఈ యావ్ ద్వారా అమ్మాయిలతో చాటింగ్‌ చేసి ఏకంగా 70 లక్షల రూపాయల మేరకు సమర్పించుకున్నాడు. ఈ వైద్యుడి వయసు 60 యేళ్లు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముషీరాబాద్‌లో భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్న డాక్టర్‌ రమేశ్‌ గుజరాత్‌లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొంతకాలం గుజరాత్‌లో, మిగతా రోజులు హైదరాబాద్‌లో ఉంటాడు. ఆరు నెలల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతితో కొంతకాలం వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు. తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. 
 
ఓ రోజు ఆ అమ్మాయి ఈ వైద్యుడిని ప్రేమిస్తున్నానంటూ వల విసిరింది. ఇద్దరు కలిసి ‘న్యూడ్‌ వీడియో(నగ్నంగా)’ కాల్స్‌ చేసుకున్నారు. ఈ బాగోతాన్ని ఆ మాయలేడీ రికార్డ్‌ చేసింది. కోరినంత డబ్బులివ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించింది. 
 
దీంతో ఆ వైద్యుడు 2020 నవంబరు నెలలో దఫదఫాలుగా ఆమెకు రూ.39 లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ డిమాండ్‌ పెరుగుతుండటంతో తట్టుకోలేక చివరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
 
అయినా తీరు మార్చుకోకుండా డేటింగ్‌ యాప్‌ల్లో ఇతర అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు ముట్టజెప్పాడని పోలీసులకు వివరించారు. 
 
ఎందుకు అనవసరంగా డబ్బులు తగలబెడుతున్నారని భార్యాబిడ్డలు ప్రశ్నిస్తే.. ‘నా డబ్బు నా ఇష్టం’.. ‘నాకు నచ్చినట్లు ఉంటా.. నచ్చినట్లు ఖర్చు చేస్తాను’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడని సైబర్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌ల వద్ద వాపోతూ ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌ ఖాతాలను స్తంభింప చేయించాలని కోరారు. దీంతో పోలీసులు ఆ వైద్యుడి ఖాతాను స్తంభింపచేయించారు.