కిలిమంజారోను అధిరోహించిన ఏడేళ్ల హైదరాబాదీ బుడతడు..
ఏడేళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి అదరహో అనిపించుకున్నాడు హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర. ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. ఆ శిఖరాన్ని అధిరోహించి చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
మార్చి 6న విరాట్ ఈ ఘనత సాధించాడు. అతడిలో పర్వతాధిరోహణపై ఎంతో తపన ఉండేదని అతడి కోచ్ భరత్ చెప్పారు. అతడితో పాటు మిగతా పిల్లలకు శిక్షణనిచ్చినా వారు మధ్యలోనే తప్పుకొన్నారని, విరాట్ మాత్రం అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో కృషి చేశాడని అన్నారు.
తన కజిన్ల ద్వారా పర్వతాధిరోహణపై ఇష్టం పెరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. వారి అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని అన్నాడు. దీంతో వారిలాగానే తాను కూడా పర్వతాధిరోహణ చేయాలనుకున్నానని చెప్పాడు. దీని గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, భరత్ సార్ దగ్గర శిక్షణను ఇప్పించారని వెల్లడించాడు.