శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (21:06 IST)

బొత్స నోటికి తాళం వేసిన సీఎం జగన్: అమరావతిలోనే ఏపీ రాజధాని?

రాజధాని అమరావతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన కలకలానికి పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అంశంపై ఎవరూ మాట్లాడ వద్దని హైకమాండ్ ఆదేశించినట్టు తెలిసింది.

మంత్రి బొత్స తన విధులు తాను నిర్వహిస్తున్నానంటూ చెప్తుండగా, మరికొందరు మంత్రులు "రాజధాని అమరావతిలోనే ఉంటుంది'' అని చెప్పుకొస్తున్నారు. వైసీపీలో ఒక్కసారిగా ఇంత క్లారిటీ ఎందుకొచ్చిందనీ, తెరవెనుక ఏం జరిగిందోననీ అందరూ ఆరా తీస్తున్నారు.

రాజధాని అమరావతిపై ప్రస్తుతం ఆ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేరుగా ఈ వివాదానికి తెరదించకపోయినా.. మంత్రివర్గ సహచరులు, పార్టీ నేతలకు కొంత స్పష్టత ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. సీఎం జగన్ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చేలోపు "వరదలకు రాజధాని మునిగిపోతుంది'' అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ హడావుడి చేశారు.

ఆయన వ్యాఖ్యలపై రాజధానిలో ప్రజలు, రైతుల నుంచి తీవ్ర నిరసన ప్రారంభమైంది. ఎక్కడ మునిగిపోయిందో చూపాలంటూ రాజధాని ప్రాంత రైతులు సవాల్ చేశారు. ఇదే తరుణంలో మంత్రి బొత్స వ్యాఖ్యలపై వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు.

బీజేపీ మరో అడుగు ముందుకేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. కొంతమంది స్వామీజీలు కూడా రంగంలోకి దిగి రాజధానిపై గళం విప్పారు. రాజధానిని మార్పుచేసి ఎలా సుఖపడతారో చూస్తామంటూ సవాల్ చేశారు.
 
అమెరికా పర్యటన ముగించుకుని సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చేలోపు ఈ వ్యవహారమంతా జరిగిపోయింది. పైగా జగన్ అనుమతిలేకుండా మంత్రి బొత్స రాజధాని అంశంపై పదేపదే మాట్లాడారని కూడా ప్రచారం ప్రారంభమైంది. మొన్న మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత కొంతమంది మంత్రుల వద్ద సీఎం జగన్ రాజధాని గురించి స్పష్టత ఇచ్చినట్టుగా సమాచారం.

రాజధానిని ఇప్పుడు మార్పుచేయటం కుదరదనీ, ఇదే సమయంలో ప్రభుత్వం వద్ద కూడా నిధులు లేవనీ, అమరావతిలో ఇప్పుడున్న కట్టడాలను పూర్తిచేసి.. సచివాలయం, అసెంబ్లీని వెలగపూడిలోనే ప్రస్తుతానికి నిర్వహిద్దామనీ ముఖ్యమంత్రి సూచించారట!

నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి సచివాలయం, శాఖాధికారుల కార్యాలయాలను అక్కడికి తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఎవరూ ధ్రువీకరించడం లేదు. మరోవైపు హెచ్‌వోడీ కార్యాలయాలను జిల్లాలకు తరలిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

అయితే పాలనాపరంగా అది సాధ్యంకాదని ఐఏఎస్‌లు, ఇతర సీనియర్ అధికారులు ఇప్పటికే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి స్పష్టంచేసినట్టు వినికిడి. రాయలసీమలో పరిశ్రమలు, ఉత్తరాంధ్రలోని విశాఖలో ఐటీ, అమరావతిలో పరిపాలన ఉండేలా చేయాలని మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉందట.

ఈ నేపథ్యంలోనే రాజధానిపై వైసీపీ నేతలు ఎవరూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడరాదని సీఎం జగన్ సంకేతాలు పంపినట్టు చెబుతున్నారు. అయితే అగ్రనేతలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. అమరావతిలో 1600 ఎకరాల్లో నిర్మించే సీడ్ క్యాపిటల్ అభివృద్ధి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని సింగపూర్ ప్రభుత్వంతోపాటు సింబ్ కార్ప్, అసెండాస్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయని ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామం ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తుందంటున్నారు. అందువల్లే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.