ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించటంతో పాటు బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మనం గణనీయమైన ప్రగతిని సాధించామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ సుస్ధిర అభివృద్దికి స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం అత్యావశ్యకమన్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సహకారంతో పరిశుభ్రత విషయాలు అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక స్దాయిలో హైదరాబాద్ కేంద్రంగా యూనిసెఫ్ నిర్వహిస్తున్న 7వ “వాష్” సదస్సుకు బుధవారం గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గౌరవ బిశ్వ భూషణ్ ప్రసంగిచారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తదనుగుణ అంశాలను చర్చించడానికి ఎన్‌ఐఆర్‌డిపిఆర్, యునిసెఫ్ సంస్ధలు నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత అంశాల ముఖ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ముదావహమన్నారు.
భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశ, జల్ జీవన్ మిషన్ ఆలంబనగా, స్పష్టమైన మార్గదర్శకాలు, తగిన బడ్జెట్లతో రక్షిత మంచి నీరు,మంచి పారిశుధ్యం, పరిశుభ్రత సేవలను వికేంద్రీకృత రీతిలో అందిస్తోందన్నారు. 2024 నాటికి అందరికీ సురక్షితమైన, తగినంత తాగునీటిని పొందడం, గృహ,సామాజిక స్థాయిలో మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందించమే ఈ మిషన్ల యెక్క ప్రధానమైన లక్ష్యాలుగా ఉన్నాయన్నారు.
భారత ప్రభుత్వం ప్రారంభించిన 100 రోజుల కార్యక్రమం ద్వారా పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు,ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీలకు నీటి సరఫరాను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మనం - మన పరిశుభ్రత, కర్ణాటకలో స్వచ్చోత్సవ నిత్యోత్సవ, తెలంగాణలోని పల్లె ప్రగతి వంటి రాష్ట్రస్థాయి కార్యక్రమాలు వాష్ పునరుద్ధరణతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించడానికి దోహదం చేస్తున్నాయని గవర్నర్ తెలిపారు.
వాష్ లక్ష్యాలను పూర్తి స్ధాయిలో సాధించటానికి నీరు,పారిశుధ్యం, పరిశుభ్రత రంగాల వారిని సమన్వయ పరచటం అత్యావశ్యకమన్నారు. పరిశుభ్రత పరంగా ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు పోరాటం చేస్తున్నా కరోనా మహమ్మారి మన సాధారణ జీవనశైలితో సహా, అన్ని రంగాలలోని 9.2 మిలియన్ల మందిని ప్రభావితం చేసిందన్నారు.
ఈ మహమ్మారి మన సమయం, వనరులు, ముఖ్య కార్యకలాపాలను పరిమితం చేయడం ద్వారా మనకు సవాలు విసిరిందని, అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. ఈ మూడు రాష్ట్రాలు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లగలిగాయని అభినందించారు.
నిజానికి తగినంత నీరు లేకుండా పారిశుధ్య చర్యలు, పరిశుభ్రత సాధ్యం కాదన్న గవర్నర్ ఈ క్రమంలో వాష్ తన వ్యూహాలను చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయి మొదలు అట్టడుగు స్థాయి వరకు అన్ని వ్యవస్ధలతో పాటు స్వతంత్ర సంస్థలను ఒక చోటకు చేర్చి విజయం సాధించిందన్నారు.
కరోనా మహమ్మారి కొత్త సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలు చేపట్టడానికి, లక్ష్య సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనేందుకు మనకు పరోక్షంగా మార్గం నిర్ధేశిందన్నారు. మూడు రాష్ట్రాలు వంద శాతం మేర వాష్ లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిపుణులు ఒకరి నుండి ఒకరు పరస్పర బదలాయింపు ద్వారా అపారమైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.