సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:50 IST)

నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు రూ.30 లక్షల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోమారు మానవీయ కోణంలో స్పందించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. 
 
ఆదివారం ఈ రాష్ట్రంలోని సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు అమరులయ్యారు. 
 
వారి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
 
ఇదిలావుంటే, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌-సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జ‌వాన్లు, మావోల మధ్య చోటు చేసుకున్న భారీ కాల్పుల్లో భారీ సంఖ్యలో జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది పూర్తిగా నిఘా వ్యవస్థ వైఫల్యమనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్ సింగ్ స్పందిస్తూ.. ఈ‌ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని తెలిపారు.
 
అలాగే, మావోయిస్టులపై దాడులకు జ‌వాన్లు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని చెప్పారు. సమస్యను ముందుగా గుర్తిస్తే జ‌వాన్లు కూంబింగ్‌కు వెళ్లర‌ని తెలిపారు. ఒక‌వేళ‌ ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది నక్సలైట్లు మరణించేవారు కాద‌ని చెప్పారు. సుమారు 25 నుంచి 30 మంది మ‌ధ్య‌ మావోయిస్టులు హ‌తమై ఉంటార‌ని కుల్దీప్ ‌సింగ్ తెలిపారు.
 
కాల్పుల నేప‌థ్యంలో గాయపడిన, మృతిచెందిన వారిని మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని ఆయ‌న చెప్పారు. ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారన్న విష‌యంపై స్పష్టత రాలేద‌ని తెలిపారు. మావోయిస్టులు జ‌రిపిన‌ ఎదురుకాల్పుల్లో గాయాలపాలైన జవాన్లను ఈ రోజు తాము కలవనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ కాల్పుల్లో 22 మంది జ‌వాన్లు మృతి చెంద‌గా, మ‌రికొంద‌రు జ‌వాన్ల‌కు గాయాలైన విష‌యం తెలిసిందే.