శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:46 IST)

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్తలు చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటవి?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రజలతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంది. 2019 జులై నుంచి రావాల్సిన ఒక డీఏను విడుదల చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 
ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏని పెంచినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. శుక్రవారం రాత్రి పలు విషయాలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 శాతానికి పెరిగింది. మూల వేతనంపై పెరిగిన డీఏ 2019 జులై-01 నుంచి అమలు కానుంది. 
 
ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలన్నారు. కేంద్రం అంచనాలు తయారు చేసి డీఏ నిర్ణయించే విషయంలో జాప్యం ఉందన్నారు. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించాలన్నారు. ప్రతిపాదనలు తయారు చేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. ఇదిలావుంటే.. 2018లో ప్రభుత్వ ఉద్యోగులకు 2.096 శాతం, 2019లో 3.144 డీఏను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. అంటే గత రెండేళ్లతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది మాత్రం ఎక్కువే డీఏ పెంచిందన్న మాట.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్ష, ఉద్యోగుల సమస్యలు, నిర్ణీత పంటల సాగు విధానం తదితర అంశాలపై ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
ఇకపై ప్రతి ఏడాది దసరా రోజునే కాకుండా, దసరా తర్వాత రోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తదనుగుణంగా షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దసరా తర్వాత రోజైన అక్టోబరు 26 కూడా సెలవుదినంగా నిర్ణయించారు.