శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (23:41 IST)

ముఖ్యమంత్రి పునరాలోచించాలి: టీడీపి నేత‌ రాయపాటి

రాజధానిలోని 29 గ్రామాలను చూస్తుంటే బాధేస్తోందని, భూములిచ్చిన వారంతా  నేడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాడికొండ నియోజకవర్గం రిజర్వుడు స్థానమని, రాజధాని ప్రాంతంలో ఒకే సామాజికవర్గం ఉందన్న ప్రచారం అవాస్తవమ న్నారు. మహిళలనే కనికరంలేకుండా వారిపై పోలీసులు రాక్షసంగా ప్రవర్తించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందనే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశార‌న్నారు. ప్రభుత్వం రాజధానిపై స్పష్టత ఇచ్చేవరకు రాష్ట్ర ప్రజల పోరాటం ఆగదని రాయపాటి తేల్చిచెప్పారు. మూడు రాజధానుల ప్రకటన చేసిన జగన్మోహన్‌రెడ్డి, తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నానన్నారు.

రాజధాని ప్రాంతంలో అన్నివర్గాలవారు ఉన్నారని, ఒక వర్గానికే మేలని జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనన్నారు. చంద్రబాబు నాయుడు   అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ది చేశాడని, పరిశ్రమలు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడన్నారు. వైసీపీలో 23మంది ఎంపీలున్నా, వారంతా ఏం చేస్తున్నారో తెలియడం లేదని రాయపాటి వ్యాఖ్యానించారు.