శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (18:08 IST)

అ..అంటే అమ్మఒడి.. ఆ.. అంటే ఆంధ్రప్రదేశ్: ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి

అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాన్ని దేశ చరిత్రలోనే ఎవరూ ప్రవేశపెట్టలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. అ.. అంటే అమ్మఒడి, ఆ.. అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకోవాల్సినంత గొప్ప పథకమని అభివర్ణించారు.

కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని ప్రతి పేద తల్లికీ అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం ‘అమ్మఒడి’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు.

ఈ సందర్భంగానే మాట్లాడుతూ, తన పిల్లలను చదివించే ప్రతి పేద తల్లికీ రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించే ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అంటూ అమ్మపేరు పెట్టడం, అమ్మలకే ఈ సహాయాన్ని అందించడం  వెనుక అమ్మ గొప్పతనం ఉందని చెప్పారు.

‘‘అమ్మ అంటే గుడి లేని దైవం.. కల్మషం లేని ప్రేమను చూపించేది అమ్మ.. సముద్రం కన్నా గొప్పది అమ్మ ప్రేమ..’’ అని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పించే సమయంలో ఇప్పటిదాకా అ.. అంటే అమ్మ అనీ, ఆ.. అంటే ఆవు అనీ నేర్పించేవారని గుర్తు చేసారు. అయితే ఇకపై అ.. అంటే అమ్మఒడి, ఆ..అంటే ఆంధ్రప్రదేశ్ అనీ నేర్పించాల్సినంత గొప్ప పథకం అమ్మఒడి అని కితాబిచ్చారు.

దేశ చరిత్రలో ఎవరూ కూడా ఎప్పుడూ, ఎక్కడా ఇంత గొప్ప పథకాన్ని తీసుకురాలేదని, ఇది ఒక చారిత్రాత్మకమైన పథకం అని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ప్రతి తల్లికీ కూడా తన పిల్లలను బాగా చదివించి గొప్పవారిని చేయాలని ఉంటుందని, అయితే పిల్లల్ని చదివించడానికి ఆర్థిక స్థోమత లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పాటుగా పోడు వ్యవసాయం పనుల్లోకి, జీడి మామిడి తోటల పనులకూ తీసుకువెళ్లడం, మట్టి పనులకు పంపడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ కారణంగానే సినిమా హాళ్లకు, హోటళ్లకు,దేవాలయాలకూ వెళ్లినప్పుడు అక్కడ చదువుకోకుండా వివిధ రకాలైన పనులు చేసుకుంటున్న పిల్లలు కనిపిస్తారని చెప్పారు.

ఈ పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా పాదయాత్ర చేసిన తరుణంలో ఆయనను కలిసిన పేద తల్లులు తమ పిల్లలను చదివించుకోవడానికి తమకు ఆర్థిక స్థోమతలేదని చెప్పుకున్నారని, అలాంటి తల్లులందరికీ వారి పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15/-లు  వేల ఆర్థిక సహాయాన్ని చేస్తానని పాదయాత్రలో హామీ ఇవ్వడంతో పాటుగా మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టారని ప్రస్తావించారు.

తాను ఇచ్చిన హామీ ప్రకారంగానే అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. గతంలో దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో పేద పిల్లల భవిష్యత్తుకు అవసరమైన ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వం స్కాలర్ షిప్ ల ద్వారా ఇచ్చే తాత్కాలిక ఉపశమనం సరిపోదని, ఈ సమస్యను శాశ్వితంగా పరిష్కరించడానికి ఫీజు రీయంబర్స్ మెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకురావడం జరిగిందని గుర్తు చేసారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలు ఎంతో మంది ప్రస్తుతం డాక్టర్లుగా, ఐటీ నిపుణులుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని తెలిపారు. అమ్మఒడి పథకం కూడా ఇదే విధంగా పేద పిల్లలకు బంగారు భవితను అందిస్తుందన్నారు.

ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే తల్లులకు మాత్రమే పరిమితం చేయాలని కొందరు సూచిస్తే, ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే తల్లులు మాత్రం తల్లులు కాదా, అని ప్రశ్నించి ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివించే తల్లులకు కూడా అందించాలని నిర్ణయించిన గొప్ప మనసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని, రక్తం పంచుకొని పుట్టకపోయినా ప్రతి తల్లికీ తోడబుట్టిన అన్నగా సహాయం అందిస్తున్న ఘనత జగనన్నదేనని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు.

అమ్మఒడి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2 లక్షలా 12 వేల 454 మంది తల్లులకు 318 కోట్లా, 68 లక్షల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోందని, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గంలో 28 వేల మంది అమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ది కలిగిందని పుష్ప శ్రీవాణి వివరించారు.

పేద పిల్లలందరికీ మంచి భవిష్యత్తును అందించాలని అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి తల్లికీ చేర్చడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అయితే పిల్లల భవితవ్యం కోసం ఆర్థిక సహాయం చేయడంతో ఆగిపోకుండా నాడు నేడు పథకం ద్వారా 9 ప్రమాణాలైన  ప్రహారీ గోడలు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్లు లాంటి మౌలిక సదుపాయాలు ప్రతి పాఠశాలలో ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మనబడి, నాడు-నేడు పథకాల ద్వారా చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.బిఆర్ అంబేడ్కర్, మాజీ జడ్పీటీసీ జెట్టి పద్మావతి, మాజీ ఎంపిపి ఇంద్రకుమారి, డిప్యుటీ డిఇఓ వెంకటేశ్వరరావు, స్కూల్ కమిటీ ఛెర్మెన్ జీవీ శ్రీనివాసరావు, హెచ్ఎం జయరాజు, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్ధులు, తల్లిదండ్రులు త‌దితరులు పాల్గొన్నారు.